దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో అనుమానాలన్నీ శశికళవైపే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దాదాపు నెలరోజులు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో జయ మరణవార్త పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే చనిపోయారని ప్రకటించేందుకు రెండురోజుల ముందే తాను బాగున్నట్లు స్వయంగా జయే వీడియో విడుదలచేశారు. రెండు రోజుల తర్వాత ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దాంతో చాలామందికి అనుమానాలు పెరిగిపోయాయి.
అయితే జయమరణంపై ఎంతమందికి ఎన్ని అనుమానాలున్నా అంత్యక్రియలంతా అయిపోయాయి. చూస్తుండగానే సంవత్సరాలు గడచిపోయాయి. అయితే ఆమె మరణంపై వస్తున్న సందేహాల కారణంగా ప్రభుత్వం అప్పట్లోనే జస్టిస్ అరుముగస్వామి కమీషన్ను నియమించింది. ఆ కమీషన్ నివేదికను ఇప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కమీషన్ రిపోర్టు ఇఫుడు సంచలనంగా మారింది. ఎందుకంటే అందులో జయమృతిపైన కమీషన్ అనేక సందేహాలు లేవనెత్తింది.
కమీషన్ నివేదిక ప్రకారం అనుమానాలన్నీ శశికళనే తప్పుపడుతున్నది. జయ మరణానికి సంబందించి కమీషన్ 8 మంది మీద అభియోగాలు మోపింది. అందులో శశికళే కీలకంగా ఉన్నారు. ఎందుకంటే శశికళ కనుసన్నల్లోనే జయకు వైద్యం జరిగిందట. విదేశాల నుండి వచ్చిన వైద్యులు జయకు ఆపరేషన్ చేయాలని సూచిస్తే ఆమె వ్యక్తి వైద్యుడు అవసరం లేదన్నట్లు కమీషన్ చెప్పింది. అలాగే జయకు జరిగిన చికిత్సకు సంబందించి అసలు ప్రిస్క్రిప్షనే కమీషన్ కు దొరకలేదట. ఇంట్లోనే జయ స్పృహతప్పిపడిపోతే ఆసుపత్రిలో చేర్చి వెంటనే పరీక్షలు చేయించకుండా కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చినట్లు కమీషన్ ఆరోపించింది.
ఇక మరణించిన డేట్ విషయంలో కూడా చాలా తేడా ఉందని కమీషన్ చెప్పింది. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు జయ చనిపోయినట్లు ప్రకటించారట. అయితే అంతకుముందురోజు మధ్యాహ్నం 3.50కి ముందే గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినట్లు రికార్డుల్లో ఉందట. మొత్తంమీద కమీషన్ జయ నెచ్చెలి శశికళ, జయ వ్యక్తిగత వ్యైద్యుడు, శిశికళ బంధువైన డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జే రాధాకృష్ణన్, ఆరోగ్యశాఖ మంత్రి పి విజయభాస్కర్, అప్పటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, అపోలో డాక్టర్లు వైవీసీ రెడ్డి, బాబూ అబ్రహం, ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డిపై విచారణ జరపాలని కమీషన్ సిఫారసుచేయటం ఇపుడు సంచలనంగా మారింది.