కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది.
కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు చేయడం కీలకమని ఏపీ సీఎం అర్థం చేసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు తెప్పించి.. విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇంకా కూడా పరీక్షలు పెంచాలని.. ప్రతి కుటుంబంలోనూ ఒకరికి కచ్చితంగా కరోనా టెస్టు చేయాలని జగన్ సర్కారు సంకల్పించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కీలక ముందడుగు వేసింది ఏపీ సర్కారు. ‘సంజీవని’ పేరుతో ఆ ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం 50కి పైగా బస్సులను ప్రవేశపెట్టింది. వాటి నమూనాలు కూడా బయటికి వచ్చాయి. ఆ బస్సుల్లో ప్రయాణికుల కోసం పెట్టిన తరహాలో సీట్లు ఉండవు. కరోనీ పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేశారు. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూశారు. కొందరు మెడికల్ సిబ్బంది అందులో ఉండి వచ్చిన వాళ్లందరికీ కరోనా పరీక్షలు చేస్తారు.
జిల్లాకు నాలుగు చొప్పున ఈ బస్సులను కేటాయించారు. ఇవి అన్ని జిల్లాల్లోనూ పట్టణాలతో సహా గ్రామాల్లో తిరిగి ఇంటికి కనీసం ఒకరి చొప్పున కరోనా పరీక్షలు చేసే పనిలో నిమగ్నమవుతాయి. ఇంటికొకరు లెక్కన కనీసం ఏపీలో కోటికి తక్కువ కాకుండా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోవడం ఖాయం.