వచ్చే ఏడాదిలో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ స్పీడుకు బ్రేకులు పడటం ఖాయమన్నట్లే ఉంది. గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 111 ఎంఎల్ఏలుండగా కాంగ్రెస్ కు 62 మంది ఎంఎల్ఏలున్నారు. మిగిలిన చిన్నాచితకా పార్టీల తరపున మరికొందరు ఎంఎఏలున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 111 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటితేనే మోడీ హవా ఇంకా రాష్ట్రంలో నడుస్తున్నట్లు లెక్క. ఈ ఫిగర్ తగ్గితే మాత్రం మోడీ ప్రభ మసకబారుతున్నట్లే అనుకోవాలి.
ఇక్కడ విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే జరిగిన కొన్ని అసెంబ్లీ, మరికొన్ని పార్ల మెంటు ఉపఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్ధానాలు దొరకలేదు. దాంతో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అంటే ప్రతిసారి ఒకపార్టీ అధికారంలోకి వస్తోంది. ప్రతి ఎన్నికకు పాలకపార్టీని జనాలు మార్చేస్తున్నారు.
ఇపుడు బీజేపీ అధికారంలో ఉందికాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే గుజరాత్ పరిస్ధితి అలాకాదు. ఎందుకంటే గడచిన 27 ఏళ్ళుగా బీజేపీనే అధికారంలో ఉంది. ఇందులో 15 ఏళ్ళు నరేంద్రమోడీయే సీఎంగా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పరిస్ధితిపై పెద్దగా క్లారిటి లేదుకానీ ఆప్ పార్టీకి మాత్రం జనాదరణ పెరుగుతోందని సమాచారం. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మీద నమ్మకం లేకే జనాలు బీజేపీకి అధికారం కట్టబెడుతున్నారట.
సరిగ్గా ఈ పాయింట్ మీద ఆప్ గుజరాత్ లోకి ప్రవేశించింది. బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. గుజరాత్ లో కేజ్రీవాల్ నిర్వహిస్తున్న సభలు, రోడ్డుషోలు, సమావేశాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటిల్లో ఆప్ తరపున కొందరు ఎన్నికయ్యున్నారు. అలాగే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆప్ చేతిలోనే ఉంది. కాబట్టి మోడీ హవాకు ఆప్ బ్రేకులు వేయటం ఖాయమనే అంటున్నారు.