జూపల్లి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ?

కారు పార్టీ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు తొందరలోనే పార్టీ మారబోతున్నారా ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాల కారణంగా అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉండేవారు. మంత్రి పదవి అందుకున్న తర్వాత జిల్లా మొత్తం మీద చక్రంతిప్పారు. అలాంటి జూపల్లి తెలంగాణా ఉద్యమంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.

మొదటి నుంచి కేసీయార్ తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. అయితే అనేక కారణాల వల్ల కేసీయార్ తో బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో మంత్రి పదవి పోవటంతోనే కాకుండా చివరకు 2018 ఎన్నికల్లో అసలు గెలుపే కష్టమైపోయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. దాంతో జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయి బీరంకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.

కొంతకాలం తర్వాత బీరం కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. దాంతో జూపల్లికి అసలుకే మోసం జరిగింది. మాజీమంత్రిని నియోజకవర్గంలో అధికారులు పట్టించుకోవటం మానేశారు. చివరకు వీళ్ళిద్దరి మధ్య గొడవల కారణంగా జూపల్లి మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారట. ఇదే విషయాన్ని కేసీయార్ దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదని జూపల్లి మండిపోతున్నారు.

దీంతోనే పార్టీలో తన పరిస్ధితి ఏమిటో జూపల్లికి అర్ధమైపోయింది. అందుకనే పార్టీమారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సీనియర్ నేతకాబట్టి బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో జూపల్లికి పడదు. మరి పాత వైరాలను సయోధ్య చేసుకుని బీజేపీలో చేరుతారా ? లేకుంట కాంగ్రెస్ లోకి మారిపోతారా అన్నది చూడాల్సుంది.