మెగా కుటుంబం క‌ద‌ల‌డం ఖాయం

ప్ర‌శ్నిస్తానంటూ.. ఉద్భ‌వించిన రాజ‌కీయ పార్టీ జ‌న‌సేనకు 9 ఏళ్లు నిండాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దీనిని 2014 ఎన్నికల‌కు ముందు స్తాపించారు. అయితే.. దీనిపై ఆయ‌న ఒంట‌రి పోరాట‌మే చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. చంద్ర‌బాబు, మోడీల‌కు స‌పోర్ట్ చేశారు. త‌ర్వాత 2019లో ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. 148 స్థానాల‌లో త‌న పార్టీ నేత‌ల‌ను నిల‌బెట్టారు. ఇది ఒక అంకం. ఈ ప‌రిణామంలో ఎక్క‌డా మెగా కుటుంబం జోక్యం చేసుకోలేదు. అంటే.. ఒక్క నాగ‌బాబు( పార్టీలో స‌భ్య‌త్వం ఉంది) మాత్ర‌మే న‌ర‌సాపురం నుంచి పోటీ చేశారు.

మిగిలిన వారిలో మెగా ఫ్యామిలీగా ఉన్న రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి స‌హా.. అల్లు కుటుంబాలు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొన్నాయి. మ‌రోవైపు.. తాను వ‌చ్చి ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పినా.. రామ్ చ‌ర‌ణ్‌ను ప‌వ‌న్ వారించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఆ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు మాత్ర‌మే ప‌వ‌న్‌కు ద‌క్కింది. ఇక‌, అప్ప‌టి నుంచి మ‌ళ్ల మూడేళ్లుగా.. బీజేపీతో క‌లిసి ముందుకు సాగుతున్నా.. ప్ర‌ధానంగా ప‌వ‌న్ ఒంట‌రి పోరు మాత్ర‌మే తెర‌మీద క‌నిపిస్తోంది.

ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ ఆయ‌న‌కు అండ‌గా ఉంటుంద‌నే సంకేతాలు వ‌చ్చాయి. తాజాగా చిరు మాట్లాడుతూ.. అవ‌స‌రం అనుకుంటే.. నేను అండ‌గా ఉంటానేమో! అన్నారు. ఆ ‘నేను..’ అంటే.. మెగా ఫ్యామిలీ అనే అనుకోవాలి.. నిజానికి ప‌వ‌న్ కోసమే తాను రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యాన‌ని చిరు చెప్ప‌డం ద్వారా.. మ‌ళ్లీ ఆయ‌న కోస‌మే వ‌స్తాన‌నే అర్ధంలోనే వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కొన్నాళ్ల కింద‌ట ఏపీ మెగా ఫ్యాన్స్ అసోసియేష‌న్లు.. విజ‌య‌వాడ‌లో భేటీ అయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని. అధికారం వ‌చ్చేలా చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించాయి.

ఇది కొన్నాళ్ల త‌ర్వాత‌.. మ‌రుగున ప‌డింది. అయితే.. ఇప్పుడు ఏకంగా.. చిరు చేసిన ప్ర‌క‌ట‌న తర్వాత‌.. గ్రౌండ్ లెవిల్లో.. చిరు ఫ్యామిలీ.. ఆయ‌న అభిమానులు అంద‌రూకూడా.. ప‌వ‌న్‌తో క‌లిసి ముందుకు న‌డిచే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా.. ఈ ప‌రిణామం క‌నుక ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే.. ప‌వ‌న్ గెలుపు సునాయాసం అవుతుంద‌ని అంటున్నారు. చిరు ఒక్క‌డు క‌దిలితే.. ఇక‌, ప‌వ‌న్‌కు తిరుగులేద‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.