గాంధీజీ రాక్షసుడిగా దుర్గా మాత విగ్రహం..వివాదం

భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అనే హిందూ అతివాది హతమార్చిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో గాంధీజీని కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో జాతిపితకు ఘోర అవమానం జరిగింది.

గాంధీజీని మహిషాసురుడుగా చూపిస్తూ తయారు చేసిన విగ్రహాన్ని ఆ పూజలో పెట్టడం వివాదాస్పదమైంది. ఓ మండ‌పంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీముఖాన్ని పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసుల ఆదేశాల ప్రకారం నిర్వాహకులు గాంధీజీ ముఖాన్ని తొలగించారు. ఈ చ‌ర్య‌ను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.

ఈ క్రమంలోనే, ఈ వ్యవహారంపై అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి స్పందించారు. ఆ విగ్రహంలో గాంధీజి తల పొరపాటున వచ్చిందని, పోలీసులు చెప్పడంతో దానిని తాము వెంటనే తొలగించామని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. అయితే, కావాలనే ఆ విగ్రహంలో గాంధీజీ తలను పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విగ్రహం తయారీదారులు ఇలా చేయరని, కొందరు గాంధీ వ్యతిరేక నేతలు ఇలా చేయించి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.