షాక్: ముంబయిలోని అంబేడ్కర్ ఇంటిపై దాడి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మహమ్మారి తీవ్రత కారణంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఊహించని విధంగా చోటు చేసుకున్న తాజా ఉదంతం సంచలనంగా మారింది. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నివాసమైన ‘రాజగృహ’పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి.

దాదర్ లో ఉండే అంబేడ్కర్ మూడంస్థుల ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దుండగులు.. అక్కడి పూలకుండీల్ని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉదంతంపై విచారణకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యల్ని చేపట్టారు. అంబేడ్కర్ నివాసమైన ‘రాజగృహ’లో తాను సేకరించిన పుస్తకాల్ని.. సాహిత్యాన్ని పెద్ద ఎత్తున ఉంచేవారు. ఆయన వాడినకొన్ని వ్యక్తిగత వస్తువుల్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తుంటారు.

అంబేడ్కర్ పై పరిశోధనలు చేయాలనుకునే వారికి.. ఈ ఇల్లు ఒక పెద్ద పరిశోధనాలయంగా ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రముఖ భవనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయటం.. ఫర్నీచర్ ను ధ్వంసం చేసే వరకూ పోలీసు వర్గాలు గుర్తించకపోవటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉదంతం రాజకీయ అంశంగా చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.