కాంగ్రెస్ పరిస్ధితి ఇలాగైపోయిందా ?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిస్ధితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది. రాజస్ధాన్లో నాయకత్వ మార్పు విషయంలో జరుగుతున్న గొడవే దీనికి తాజా ఉదాహరణ. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నారు. మనిషికి ఒకటే పదవి అన్న విధాన నిర్ణయం ప్రకారం సీఎం పదవికి రాజీనామా చేయమని సోనియా చెప్పారు. అయితే ఇందుకు గెహ్లాట్ అంగీకరించటంలేదు. ఏదో తంటాలుపడి మొత్తానికి ఒప్పించారు.

అయితే గెహ్లాట్ షరతు విధించారు. అదేమిటంటే తన బద్ధవిరోధి సచిన్ పైలెట్ కు బదులు తాను సూచించిన నేతనే సీఎంగా ఎంపికచేయాలని. నిజానికి ఇలా ఏ పార్టీలోను జరగదు. కాంగ్రెస్ లో కూడా ఇంతకుముందు ఇలాగ జరగలేదు. మరిప్పుడే ఎందుకు జరుగుతోందంటే పార్టీ అధిష్టానం అంత బలహీనమైపోయింది కాబట్టే. సీఎల్పీ సమావేశాన్ని కూడా అధిష్టానం నిర్వహించలేకపోయింది. సీఎల్పీ సమావేశాన్ని కాదని మంత్రులు, ఎంఎల్ఏలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సరే దానితర్వాత తలెత్తిన పరిస్ధితులను చక్కదిద్దేందుకు అధిష్టానం మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమలనాధ్ కు బాధ్యత అప్పగించింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తన రాష్ట్రంలో జ్యోతిరాధిత్య సింథియాతో వివాదాన్ని పరిష్కరించుకోలేక చివరకు ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్న గొప్ప నేత కమలనాథ్. ఇపుడు రాజస్ధాన్లో వివాదం లాంటిదే మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. సింథియాకు సీఎం కుర్చీని అప్పగించేందుకు కమల్ అంగీకరించకపోవటంతో విసిగాపోయిన సింథియా తన వర్గంతో కాంగ్రెస్ లో నుండి బయటకు వెళ్ళిపోయారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.

ఇక్కడ కమలనాధ్ వైఖరి అయినా గెహ్లాట్ వైఖరి అయినా ఎలాగుందంటే ఉంటే తాము మాత్రమే సీఎంలుగా ఉండాలి లేకపోతే ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదన్నట్లుగా ఉంది. ఇలాంటి నేతలున్నారు కాబట్టే కాంగ్రెస్ పరిస్ధితి ఇంత దయనీయంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడుసార్లు సీఎంగా చేసిన గెహ్లాట్ మొదటిసారి సచిన్ కు కుర్చీని అప్పగించమంటే ఒప్పుకోవటంలేదు. పార్టీలో ఇలాంటి నేతలున్నంతవరకు బీజేపీ హ్యాపీగా ఉండచ్చు.