పేరు మార్చడం తప్పు కాదన్న లక్ష్మీ పార్వతి

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడంపై టీడీపీ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ యూనివర్సిటీకి తన తండ్రి వైఎస్ఆర్ పేరుని పెట్టడంపై సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, ఈ పేరు మార్పు వ్యవహారంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇంతవరకు స్పందించలేదు. దీంతో, లక్ష్మీపార్వతిపై మీడియాలో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఆ యూనివర్సిటీ పేరు మార్పును లక్ష్మీపార్వతి పరోక్షంగా సమర్థించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, అది ప్రభుత్వం నిర్ణయం అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు .

అదేవిధంగా, ముఖ్యమంత్రి జగన్…ఆ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారని అన్నారు. అయితే, ఎన్టీఆర్ కుటుంబసభ్యురాలిగా జిల్లా పేరు మార్పు, యూనివర్సిటీ పేరు మార్పు అంటూ రెండు తనకు రెండు ఆప్షన్లు ఇస్తే జిల్లా పేరు మార్పుకే మొగ్గు చూపుతానని చెప్పారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించినా పర్వాలేదు అనే ఉద్దేశంలో లక్ష్మీపార్వతి మాట్లాడారు.

అంతేగానీ, ఎన్టీఆర్ చొరవతో ప్రారంభించిన హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం సరికాదని ఆమె ఖండించలేదు. అంతేకాదు, ఈ పేరు మార్పు వ్యవహారం నేపథ్యంలో తనపై తన వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయని, ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

తమ వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు అంటూ ఆమె కామెంట్ చేశారు. తమ వివాహం గురించి, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్న విషయం గురించి ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. కావాలంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు చూడాలని అన్నారు. ఏది ఏమైనా, ఆ పేరు మార్పును సమర్థిస్తూ లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.