జగన్ సర్కారుకు రమణ దీక్షితులు షాక్

తిరుమల శ్రీవారి ఆలయంలో దశాబ్దాలుగా కీలక పురోహితుడిగా ఉన్న రమణ దీక్షితులు.. మరోసారి చర్చనీయాంశంగా మారారు. టీటీడీకి సంబంధించి ఆయన తాజా ట్వీట్ సంచలనం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లో నాలుగు ధామాలు, మరో 51 ఆలయాలకు సంబంధించిన కేసుల్లో కోర్టు ఆర్డర్‌లు రిజర్వ్ చేసిందంటూ భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. రమణ దీక్షితులు ‘‘ఆల్ ది బెస్ట్ స్వామీ.. ఆ దేవుడు మీకు విజయాన్ని అందించేలా దీవించాలని కోరుకుంటున్నాను. మీ విజయం సనాతన ధర్మానికి విజయంగా భావిస్తున్నాం.. ఉత్తరాంఖండ్ తర్వాత తిరుమల ప్రభుత్వ చెర నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ట్వీట్ వేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు హయాంలో ఇబ్బంది పడ్డ రమణ దీక్షితులుకు జగన్ సర్కారు మంచి ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడిలా ప్రభుత్వం నుంచి తిరుమల ఆలయానికి విముక్తి కలగాలని ట్వీట్ వేయడం సంచలనం రేపుతోంది.

గత కొంత కాలంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు రమణ దీక్షితులు. చంద్రబాబు హయాంలో టీటీడీ ప్రధాన అర్చకులుగా, ఆగమ శాస్త్ర సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులుపై వేటు వేయడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలవడం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిన విషయాలే.

వైకాపా అధికారంలోకి వస్తూనే రమణ దీక్షితులుకు తిరిగి టీటీడీలో సముచిత స్థానం కల్పించింది. ఆయన కొంతకాలం పాటు ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళలేదు. అయితే, ఆ మధ్య టీటీడీ భూముల అమ్మకం, లడ్డూ విక్రయాలు సహా పలు అంశాలపై రమణ దీక్షితులు ప్రతికూల వ్యాఖ్యలు చేసి, వార్తల్లోకెక్కారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితులు పెద్దగా మారలేదని.. టీటీడీలో పరిణామాలు ఏమంత బాగా లేవని.. ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీటీడీపై ప్రభుత్వ పెత్తనం వుండకూడదంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ సోషల్‌ మీడియా వేదిగాక స్పందించడం చర్చనీయాంశం అవుతోంది.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content