ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం అసెం బ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్‌ను తానుకానీ, పార్టీ నాయకులు కానీ.. ఎక్కడా .. ఎప్పుడూ.. కించపరచలేదన్నారు. ఆయనపట్ల తనకు ఎఫెక్షన్ ఉందని తెలిపారు. పాదయాత్ర సమయంలో కూడా.. ఎన్టీఆర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సమయంలో కొందరు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారన్నారు.
దీంతో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్టు చెప్పారు. అదేసమయంలో చంద్రబాబుపైనా.. జగన్ సటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ను పూర్తిపేరుతో నందమూరి తారక రామారావుగారు అని పిలిస్తే.. చంద్రబాబుకు నచ్చదని.. జగన్ అన్నారు. చంద్రబాబు స్వయంగా నందమూరి తారకరామా రావు గారు అని పిలిస్తే.. పైన ఉన్న ఎన్టీఆర్ కు నచ్చదని వ్యాఖ్యానించారు. సినీరంగంలో ఆయనకు ఉన్న అభినివేశం.. దేశంలోనే ఎవరికీ లేదని జగన్ చెప్పారు.
ఏడు సంవత్సరాలు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే.. ఆయన మరిన్ని సంవత్సరాలు.. జీవించి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే.. ఆయన మరిన్ని సంవత్సరాలు.. ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు అంతేకాదు. చంద్రబాబు అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కూడా కాదని జగన్ ఎద్దేవా చేశారు.
కేంద్రంలో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు .. తన పార్టీ నేతలకు పదవులు ఇప్పించుకున్నారని.. చెప్పారు. అదేసమయంలో తనకు అండగా ఉన్న కొందరు వ్యక్తులకు అవార్డులు కూడా ఇప్పించుకున్నారని.. జగన్ అన్నారు. అయితే.. తనకు పిల్లనిచ్చిన మామకు మాత్రం భారతరత్న అవార్డును ఇప్పించుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
“ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం. నేను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదు. ఎన్టీఆర్ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదు. చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదు” అని జగన్ వ్యాఖ్యానించారు.