అదేంటి.. అని ఆశ్చర్య పోతున్నారా? ఒక అమరావతి వరకు ఓకే.. కానీ ఇద్దరు జగన్‌లు ఏంటి? ఔను! నిజమే.. నవ్యాంధ్ర రాజధాని.. అమరావతి ఒక్కటే. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి లోనే ఇద్దరు జగన్‌లు కనిపిస్తున్నారని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కనిపించిన జగన్.. ప్రస్తుతం కనిపిస్తున్న జగన్.. వేర్వేరని నెటిజన్లు జోకులు పేలుస్తూ.. పళ్లు బిగిస్తున్నారు. మరి ఇంతకీ.. జగన్ చెబుతున్న అమరావతి కథలేంటో.. చదివి తరిద్దామా!!
ఏం జరిగింది..
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టంగా చెప్పినా మూడు రాజధానులపై మొండిపట్టుతో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందేనని నెటిజన్లు చెబుతున్నారు. ఆవు చేలో మేస్తే అన్న సామెతలా.. ముఖ్యమంత్రి మెప్పు కోసం తహతహలాడే మంత్రులు, శాసనసభ్యులు అమరావతి పై ఫక్తు ఆయన నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో శాసనసభలో ఈ సందర్భంగా అమరావతిపై అభాండాలు వేశారనేది నెటిజన్ల వ్యాఖ్య.
ప్రతిపక్షంలో జగన్!!
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ప్రస్తుత సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఈ మూడూ ఎక్కడుంటే అదే రాజధాని’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు… 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వం పోయి తాము అధికారంలోకి వచ్చాక రైతులంతా ఆనందపడేలా బ్రహ్మాండమైన రాజధాని కడతామని మరో సభలో ఢంకా భజాయించి చెప్పారు.
అధికారంలో జగన్!!
రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టాలా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చి చేసిన త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు.
రైతులను పరిహసిస్తున్నారు
అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ 1000 రోజులకుపైగా గాంధేయ మార్గంలో వారు చేస్తున్న పోరాటాన్ని కృత్రిమ ఉద్యమమని వైసీపీ నాయకులు పరిహసిస్తున్నారు. తమకున్న అర ఎకరం, ఎకరం భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన పేద రైతులను పెత్తందార్లని అభాండాలు వేస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పునూ పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకూ ముఖ్యమంత్రి కాలు దువ్వుతున్నారు. అందుకు వంత పాడుతూ మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమంటున్న మంత్రులు.. నాయకులు న్యాయ వ్యవస్థనే లెక్క చేయడం లేదు. మరి దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates