వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇటీవలే సానుకూల వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే ఆ వ్యాఖ్యలు కరోనాపై పోరులో జగన్ సర్కారు చేస్తున్న కృషి వరకే పరిమితం అని పవన్ సంకేతాలిచ్చారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై అక్కడి రైతుల పోరాటం 200వ రోజుకు చేరిన నేపథ్యంలో వారికి తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించాడు పవన్. అమరావతి ఉద్యమం మొదలైన కొత్తలో పవన్.. అక్కడికి వెళ్లి రైతులకు సంఘీభావం ప్రకటించడం.. వారికి మద్దతుగా నిరసన దీక్షలో కూర్చోవడం తెలిసిన సంగతే.
ఐతే కొన్నాళ్లు ఆ ఉద్యమం విషయంలో పట్టుదలతో కనిపించిన పవన్.. తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టేసినట్లు కనిపించాడు. దాని గురించి మాట్లాడనే లేదు. కానీ ఉద్యమం 200వ రోజుకు చేరిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎన్నారైలు నిరసన గళాలు వినిపంచడం.. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు కూడా కలిసి రావడం గమనించిన పవన్.. ఇందులో తాను కూడా భాగం కావాలనుకున్నట్లున్నాడు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులకు మద్దతుగా ప్రకటన ఇవ్వడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించారని, అందుకే రైతులు తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని.. తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకొంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అనమానించడమేనని పవన్ అన్నాడు. రాజధానిని పరిరక్షించునేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ఆ పోరాటానికి తమ పార్టీ సంఘీభావం ఉంటుందని.. భారతీయ జనతా పార్టీతో కలసి వారికి అండగా నిలబడతామని, ఎట్టి పరిసితుల్లోనూ 29వేల మంది రైతుల త్యాగాలను వృథా కానీయమని పవన్ పేర్కొన్నాడు.
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చెయాలి అంతే తప్ప గత ప్రభుత్వం వేరు మా ప్రభుత్వం నేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదని.. రైతులు తము భూములను ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప… ఒక వ్యక్తికో, పార్టీకో కాని.. ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని పవన్ స్పష్టం చేశాడు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదని పేర్కొన్నాడు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది తమ అభిమతమని.. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికంద్రీకరణ అయినట్లు కాబోదని, ఏ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ది ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పవన్ ఈ ప్రకటనలో స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates