కరకట్ట నిర్మాణాలను కూల్చేస్తారా ?

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాల్సిందే అని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై జరిగిన ఒక విచారణలో హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలు, చెరువులు, నీటికుంటలు చివరకు శ్మశానాలను కూడా కబ్జాదారులు వదలటం లేదని మండిపోయింది. రెవిన్యు శాఖలోని అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కవటం వల్లే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నట్లు హైకోర్టు తేల్చిచెప్పింది.

40 ఏళ్ళ క్రితం కట్టిన నిర్మాణాలైనా సరే కబ్జా చేసిన స్ధలంలో నిర్మించిందని నిర్ధారణ అయితే వెంటనే కూల్చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. ఆక్రమణదారులు, కబ్జాదారులు తమ దృష్టిలో ఎవరైనా ఒకటే అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే కృష్ణానది కరకట్టపైన నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాల్సిందే అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆక్రమణలను, కబ్జాల వివరాలను హైకోర్టు పరిశీలిస్తోంది.

హైకోర్టు చెప్పిన కరకట్టపైన నిర్మాణాలంటే లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్, మంతెన సత్యానారాయణరాజు నిర్వహిస్తున్న ప్రకృతి వైద్యం తదితరాలతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నిర్మించుకున్న భవనాల్లాంటివి చాలానే ఉన్నాయి. వీటిని తొలగించాలని గతంలోనే ప్రభుత్వం ప్రయత్నించినా కొందరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. దాంతో ఆక్రమణల తొలగింపు సాధ్యం కాలేదు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే కరకట్ట మీద నిర్మించిన వాటిల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలకు నోటీసులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అప్పట్లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావే స్వయంగా పడవలో ప్రయాణించి అక్రమ నిర్మాణాలకు నోటీసులు అంటించిన విషయాలు అందరికీ తెలిసిందే. తర్వాత ఏమైందో ఏమో ఏ అక్రమనిర్మాణాన్ని ప్రభుత్వం తొలగించలేదు. ఇపుడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం కారణంగా మళ్ళీ ఆ విషయాలన్నీ ఇపుడు కోర్టు విచారణ సందర్భంగా చర్చకు వచ్చాయి. అంటే తొందరలోనే కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాలను కూల్చేయటం ఖాయమేని అనుకుంటున్నారు. మరీపని ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.