ఏపీలో గురుపూజా రాజ‌కీయం.. ఏం జ‌రుగుతోందంటే

గురు బ్ర‌హ్మ‌.. గురు విష్ణు.. అంటూ.. గురుదేవులను పూజించుకునే వేళ‌.. ఏపీలో రాజ‌కీయం అనేక కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. గురుపూజ‌లకు కూడా రాజ‌కీయం అలుముకుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కం ట్రిబ్యూట‌రీ పింఛ‌న్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయుల‌పై పోలీసులుకేసులు పెట్టి వేధించ‌డాన్ని నిర‌శిస్తూ.. గురువులు.. మూకుమ్మ‌డిగా ఈ ఉత్స‌వాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించారు. ఇప్ప‌టికే స‌ర్కారుకు నోటీసులు కూడా జారీ చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. ఉపాధ్యాయులు సోమ‌వారం నాటి గురుపూజా ఉత్స‌వాల‌ను బ‌హిష్క‌రించినట్టు అయింది. అయితే.. ఇక్క‌డే కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుందని అంటున్నారు. విజ‌య‌వాడ‌లో ప్ర‌భుత్వం అధికారికంగా..గురుపూజా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 176 మంది ఉపాధ్యాయుల‌కు ఉత్త‌మ గురువుల అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్నారు.

అంతేకాదు.. వారిని ఘ‌నంగా స‌త్క‌రిస్తార‌ని కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌రి.. ఒక‌వైపు ఉపాధ్యాయులు నిర‌స‌న‌గా.. ఈ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రిస్తూ.. స‌ర్కారుకే నోటీసులు ఇచ్చిన క్ర‌మంలో ఇప్పుడు ఇలా.. ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేయ‌డం.. వెనుక‌, ఈ కార్య‌క్ర‌మానికి సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌న్ హాజ‌రు కావ‌డం వెనుక‌.. అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయని.. ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల్లో చీలిక‌లు తెచ్చే ప్ర‌య‌త్నం ఏదో జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

రాత్రిరాత్రి.. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఒక‌టి రెండు సంఘాల‌ను ఒప్పించి.. త‌మ దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు సాగాయ‌ని.. ఓ సంఘం నాయకులు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు. త‌ద్వారా.. వారికి కొన్ని అవార్డులు ఇచ్చి.. ఉపాధ్యాయులు చేస్తున్న నిర‌స‌న‌లో ప‌స‌లేద‌నే సంకేతాలు పంపించేలా.. ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. ఫ‌లితంగా.. ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు సీపీఎస్‌పై ఏవిధానం అనుస‌రించిందో.. దానినే ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు రెడీ అయింద‌ని.. గురుపూజోత్స‌వాన్ని సైతం.. రాజ‌కీయం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.