గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభం కుటుంబం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిబాబు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కాపులను బీసీల్లో చేరుస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలన్న డిమాండుతో ముద్రగడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చేసిన ఆందోళనలను కాపు సామాజికవర్గం తరపున చేశారే కానీ ఏ పార్టీ తరపునో చేయలేదు. కాపుల్లో ముద్రగడ తిరుగులేని పట్టుందని చెప్పేందుకు లేదుకానీ మంచి ఇమేజి ఉందని మాత్రం చెప్పచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడకు కాపు సామాజికవర్గంతో పాటు కాపు సంఘాల్లో మంచి సంబంధాలున్నాయి.
ఈయన్ను జనసేనలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరిగినా ఎందుకనో సక్సెస్ కాలేదు. అలాగే బీజేపీలో చేరాలని ముద్రగడపై కొందరు ఒత్తిళ్ళు తెచ్చినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. అయితే తాజా పరిణామాల్లో ఆయన కొడుకు గిరిబాబు వైసీపీలో చేరటానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కొడుకు వైసీపీలో చేరటమంటే అందుకు పద్మనాభం ఆమోదం లేకుండా జరగదని అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో ఎక్కడినుండో గిరిబాబుకు టికెట్ ఖాయంగా ఇచ్చేట్లుంటేనే గిరిబాబును పార్టీలో చేర్చుకుంటారు. పోటీ చేయించే ఉద్దేశ్యం లేనపుడు ఆయన్ను వైసీపీలో చేర్చుకోవటం దండగే.
అయితే వచ్చే ఎన్నికల్లో లబ్దికోసమని అవకాశం రాగానే ఎంఎల్సీ స్ధానాన్ని కేటాయించే అవకాశం కూడా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించే పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. అందుకనే అన్నీపార్టీలు ప్రత్యేకించి గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాయి. ముద్రగడ కుటుంబం గనుక వైసీపీలో చేరితే రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates