వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు.
అది కూడా తమ పార్టీకి చెందిన నేతల అంశంపై. వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను మొదటిసారి కలిసింది సెర్బియాలో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించమని కోరేందుకు. ఆ తర్వాత ఇటీవల రెండోసారి కలిశారు. ఇప్పుడు తమ పార్టీ నుండి గెలిచి.. వ్యతిరేక గళం విప్పుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోమని కోరేందుకు.
ఇటీవల రఘురామ కృష్ణంరాజు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకంపై గళమెత్తారు. రాజధానిగా అమరావతి ఉండాలని, భిన్నగళం వినిపిస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైసీపీ ఆయనపై వేటు వేద్దామనుకున్నప్పటికీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తూ.. వారికి రఘురామ అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారు రెండు రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.