తెలంగాణాలోకి కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ఎంట్రీని కేసీయార్ నిషేధిస్తారా? బీహార్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన ప్రత్యర్ధులను వేధించటానికి, ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటీలను యధేచ్చగా వాడుకుంటున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే బీహార్లోకి సీబీఐ ఎంట్రీని నిషేధించటాన్ని కేసీయార్ మద్దతిచ్చారు.
శాంతి భద్రతలన్నది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి సీబీఐని దేశవ్యాప్తంగా నిషేధించాలని కేసీయార్ పిలుపునిచ్చారు. ఇప్పటికే సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. తాజాగా ఇచ్చిన పిలుపును గమనిస్తే తెలంగాణాలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ కేసీయార్ కూడా నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు ప్రముఖంగా వినబడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి కవితపై రాజకీయపరమైన ఆరోపణలే ఉన్నప్పటికీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాగా దూకుడుగా వెళుతున్నది. కాబట్టి ఏదో రోజు కవిత దగ్గరకు కూడా సీబీఐ వచ్చే ప్రమాదముందని కేసీయార్ భయపడుతున్నట్లు ఉన్నారు. అందుకనే తెలంగాణాలోకి సీబీఐ ఎంట్రీని నిషేధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సీబీఐ ఎంట్రీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించవచ్చు. అయితే ఏ విషయంలో అయినా సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు. మామూలు పరిస్ధితుల్లో రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి ఎంటరవ్వలేందంతే. లిక్కర్ పాలసీలో కవితను సీబీఐ విచారించాలంటే ఢిల్లీ హైకోర్టు అనుమతి తీసుకుంటే దాన్ని కేసీయార్ కూడా అడ్డుకునేందుకు లేదు. మొత్తానికి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మళ్ళీ గళం విప్పిన కేసీయార్ సీబీఐ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.