చెత్త‌ప‌న్ను కోసం.. ఇంత పీడించాలా..

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం డ‌బ్బుల కోసం.. ఏదైనా చేస్తుంద‌నే వాద‌న జోరుగా వినిపిస్తోంది. కేంద్రం ఒత్తిళ్లకు త‌లొగ్గో.. లేక‌.. ఖ‌జానాలో సొమ్ము లేక‌పోవ‌డంతోనో.. ప్ర‌జ‌ల‌పై వివిధ రూపాల్లో ప్ర‌భుత్వం ఒత్తిడి తీసుకు వ‌స్తోంద‌నే వాద‌న అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అయినా.. కూడా ఎక్క‌డా అధికారులు వెన‌క్కి త‌గ్గడం లేదు. ముఖ్యంగా ప్ర‌జ‌ల ముక్కు పిండి అయినా.. చెత్త‌ప‌న్నును వ‌సూలు చేయాల‌ని.. అధికారులు భావిస్తున్నారు. వారికి పైనుంచి తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయ‌ని అంటున్నారు.

ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చెత్త‌ప‌న్నును వ‌సూలు చేయ‌డంలో విఫ‌ల‌మైన అధికా రుల‌తో గోడ కుర్చీ వేయించార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఎవ‌రూ మాట్లాడ‌లేదు. అదేస‌మ‌యంలో కిందిస్థాయి సిబ్బందిపై అయితే.. ఆబ్సెంట్ వేస్తామ‌ని.. జీతం క‌ట్ చేయిస్తామ‌ని.. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో అధికారులు చెత్త ప‌న్నుకోసం.. ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్పులు పెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చెత్త ప‌న్నుక‌ట్ట లేద‌నే వంక‌తో.. నేరుగా.. భౌతిక దాడుల‌కు కూడా అధి కారులు వెనుకాడ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఓ అపార్ట్‌మెంట్ ముందు.. మునిసిప‌ల్ అధికారులు త‌మ సిబ్బందితో చెత్త‌ను పోయించిన వీడియో.. భారీ ఎత్తున వైర‌ల్‌గా మారింది. కేవ‌లం చెత్త ప‌న్ను క‌ట్ట లేద‌నే వంక‌తో.. అపార్ట్‌మెంటు వాసుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ.. చెత్త‌ను అపార్ట్‌మెంటుకు వెళ్లే దారిలో కుమ్మ‌రించారు.

ఈ ప‌రిణామాల‌తో అపార్ట్‌మెంటు వాసులు హ‌ర్ట‌య్యారు. అనేక రూపాల్లో అనేక వ‌స్తువుల‌పై ప‌న్నులు వసూలు చేస్తున్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు చెత్త ప‌న్ను కోసం.. ఇంత చెత్త‌ప‌నులు చేయాలా? అని ప్ర‌జ‌లు విరుచుకుప‌డుతున్నారు. ఇలాంటి ప‌నుల వ‌ల్ల ప్ర‌భుత్వానికి మంచి పేరు రాక‌పోగా.. ఉన్న కొద్దిపాటి ఇమేజ్ కూడా త‌గ్గిపోవ‌డం ఖాయ‌మ‌ని.. వైసీపీ సానుభూతి ప‌రులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.