ఏపీలో వైసీపీ ప్రభుత్వం లెక్కలేని విధంగా నియమిస్తున్న సలహాదారుల విషయంపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు సలహాదారులు ఎందుకు? అని ప్రశ్నించింది. సలహాదారులు కేవలం సలహాలకే పరిమితం కావడం లేదని.. రాజ్యాంగేతర శక్తులుగా మారిపోతున్నారని.. తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని న్యాయమూర్తుల ధర్మాసనం నిలదీసింది.
మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌కూ సలహాదారుణ్ని నియమిస్తారని.. వ్యాఖ్యానించింది. సలహా దారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే దేవదాయశాఖ సలహాదారుగా ఇటీవల.. నియమితులైన జె.శ్రీకాంత్ నియామకానికి సంబంధించిన జీవోను నిలుపుదల చేసింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‍కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది.
ఎవరీ శ్రీకాంత్.. ఏంటి కథ?
అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్‌ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి, దీన్ని మూడు ముక్కలు చేశారు. ఎవరికి వారు తమనే అధ్యక్షులుగా చెప్పుకొంటున్నారు. వారిలో శ్రీకాంత్ ఒకరు.
ఈయన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనంతపురం నగరపాలక సంస్థ పరిధి సమన్వయకర్తగా కొంతకాలం ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లారు. ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి ఈయన చాలాకాలంగా ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నారు. గతంలో ఆయన్ను అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సిఫార్సు ద్వారా తొలుత టీటీడీ బోర్డు సభ్యుని పదవి కోసం ప్రయత్నించారు.
ఆ అవకాశం రాకపోవడంతో.. సలహాదారు పదవిపై దృష్టి పెట్టారు. చాలాకాలంగా ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి దేవాదాయశాఖలో సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదని, దానికి విధులు, బాధ్యతలు వంటివి తెలిపే ఉత్తర్వులూ లేవని, దీన్ని రాజకీయ పునరావాసంగానే పరిగణించాలని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టులో కేసు దాఖలైంది. దీనిని విచారించిన ధర్మాసనం. సలహాదారులపై నిప్పులు చెరగడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates