కలెక్టర్లకు జగన్ హోం వర్క్

మామూలుగా హోంవర్కంటే ఇంట్లో కూర్చుని పిల్లలు చేసేది. కానీ ఇక్కడ కలెక్టర్లకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హోంవర్క్ ఏమిటంటే ప్రతి నెల గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించటమే. ప్రతినెలా ప్రతి నియోజకవర్గంలోని 6 సచివాలయాలను కలెక్టర్లు విధిగా సందర్శించాల్సిందే అని తాజాగా ఆదేశించారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమంలో కలెక్టర్లు సచివాలయాలను సందర్శించాల్సిందే అని, వాటి పరిధిలో డెవలప్మెంట్ కార్యక్రమాలను టేకప్ చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు.

ఇప్పటివరకు గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఏలు విధిగా పాల్గొనాల్సిందే అని పదే పదే చెప్పారు. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినా ప్రజా ప్రతినిధులు మాత్రం కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని జగన్ ప్రతి సందర్భంలోను చెబుతూనే ఉన్నారు. పనిలోపనిగా ప్రతి సచివాలయం పరిధిలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు రు. 20 లక్షలు కేటాయించారు.

ఈ లెక్కన రాష్ట్రమొత్తంమీద రు. 3 వేల కోట్లు కేటాయించినట్లు జగన్ చెప్పారు. ఒకవైపు కలెక్టర్లు స్పందన కార్యక్రమంలో పాల్గొంటునే మరోవైపు గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందే అన్నారు. తమకు అందిన ప్రతిపాదనలను ప్రజాప్రతినిదులు కలెక్టర్లకు పంపాల్సిందే. డైరెక్టుగా కలెక్టర్లే సచివాలయాలను సందర్శించినపుడు వచ్చే వినతుల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలకు విజ్ఞప్తులుంటే వాటిని కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చెప్పి వెంటనే ప్రారంభించాలన్నారు. దీనివల్ల పనులు టేకప్ చేయటంలో జాప్యం తగ్గుతుందన్నది జగన్ ఆలోచన.

ఏదేమైనా షెడ్యూల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజాప్రతినిధులను అటు అటు కలెక్టర్లను ప్రజల మధ్యనే ఉండేట్లుగా జగన్ ప్లాన్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏకకాలంలో మొత్తం జిల్లా యంత్రాంగమంతా జనాల్లోనే ఉన్నట్లవుతుంది. కలెక్టర్ వచ్చారంటే ఎలాగూ ఆర్డీవో, ఎంఆర్వో తదితర రెవిన్యు యంత్రాంగమంతా రావాల్సిందే కదా. ఈ రకంగా ప్రభుత్వం మొత్తం జనాల దగ్గరకే వచ్చినట్లవుతుంది. అయితే దీనివల్ల ప్రజా సమస్యలు పరిష్కారమైతేనే ఉపయోగం లేకపోతే జనాలే రివర్సవుతారు.