ఆనం రామనారాయణ రెడ్డి రిటైర్ అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో ఆసక్తిగా మారిన విషయం. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. పార్టీలో తనకు ప్రాధాన్యందక్కడం లేదని.. ఎమ్మెల్యేగా కూడా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాని కి ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించారు.
అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై అధిష్టానం దృష్టి పెట్టలేదు. ఎందుకంటే.. స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా ఆనం వ్యవహరించడమే. ఈ నేపథ్యంలోనే ఆయనను దాదాపు పక్కన పెట్టారు. ఆయనతో ఎవరూ నాయకులు కూడా కలవడం లేదు. ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. పైగా.. ఇప్పటికీ కూడా.. ఆనం.. విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆయనను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఆనం వర్గం మాత్రం.. ఆయనను తప్పించడం కాదు.. పార్టీలో నుంచే ఆయన బయటకు వస్తారని అంటున్నారు. టీడీపీలో చేరడం ఖాయమేనని.. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ దఫా పోటీ చేస్తా రని.. గెలుపు గుర్రం కూడా ఎక్కుతారని చెబుతున్నారు.ఇక, వైసీపీలో ముదురుతున్న వివాదాల కారణం గానే ఆనం కూడా టీడీపీవైపు చూస్తారని అంటున్నారు. టీడీపీలోకి ఆనం తిరిగి వస్తే.. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని టీడీపీలోని ఓ వర్గం చెబుతోంది.
ఈ క్రమంలో ఆనం రాకకోసం.. టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆనం మాత్రం వైసీపీని వీడరని… వచ్చే ఎన్నిక లనాటికి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా.. మళ్లీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు… రాం కుమార్‌కు టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించినా.. ఆయనకు దక్కలేదు. కానీ, ఈ దఫా.. మాత్రం ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates