కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వ్యాపారులు లక్ష్మణరావు, మోహనరంగారావు, శేషుకుమార్ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతు న్నారని పిటిషనర్ తెలిపారు. అంతేకాదు.. ఈ కేసును తీవ్రంగా పరిగణించాలన్నారు.
వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని పిటిషనర్ ముప్పనేని రవికూమార్ తరపు న్యాయవాది కోరారు. బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లనుకూల్చినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫల మయ్యారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే సహా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. దీనిపై అసలు ఏం జరిగిందనేది ఎమ్మెల్యే వర్గం అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం.
వాస్తవానికి.. చెరువులు తొవ్వద్దని, గనుల జోలికి వెళ్లొద్దని.. గతంలోనే జిల్లా అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎప్పుడూ.. కూడా ఈ వివాదాలతోనే ముందుకు సాగే కొందరు అధికారులు కూడా ఉన్నారు. వీరికి అనుకూలంగా ఉండే దిగువ స్థాయి అధికారులు.. నేతలు కొందరు గ్రూపుగా ఏర్పడి జిల్లాలో సహజ వనరులను దోచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఆలయాలకు చెందిన చెరువులను.. గనులను కూడా తొవ్వేస్తున్నారని.. కొన్నాళ్లుగా ఇక్కడ తీవ్రస్థాయిలో విమర్శలు రావడం గమనార్హం. అయితే.. గతంలో ఉన్న ప్రభుత్వం,. ఇప్పుడున్న ప్రబుత్వం కూడా వీటిని లైట్ తీసుకుంది. దీంతో పరిస్థితి హైకోర్టు వరకు చేరింది.