వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ ద‌డ

ఔను! ఇప్పుడు ఏపీ అధికార‌పార్టీలో ఎమ్మెల్యేల‌కు.. టికెట్ల ద‌డ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాలంటే.. అంత ఈజీయేమీ కాద‌ని..సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య  ఉండాల‌ని.. వారి క‌ష్టాలు తీర్చాల‌ని.. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని.. ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాదు.. నిత్యం గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలో నేత‌ల‌కు స‌హ‌జంగానే ఆందోళ‌న క‌మ్మేసింది. అయితే కొంద‌రు మాత్రం.. ఇంకా ఆలోచిస్తున్నారు.

కానీ,  వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందా.. రాదా అని బెంగ పెట్టుకున్న వారు మాత్రం త‌మ‌దైన శైలిలో ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వీరిలో ఇప్పుడు..రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారంలోకి వ‌స్తున్నారు.. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు. ఈయ‌న విష‌యం ఆద్యంతం ఆస‌క్తిక‌రం. గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టంమీద టికెట్ తెచ్చుకున్న ఆయ‌న అత్యంత తక్కువ కాలంలోనే వివాదం అయ్యాడు. స్థానికంగా.. వైసీపీ నేత‌ల‌ను వ‌ర్గాలుగా విభ‌జించార‌నే పేరుంది.

అంతేకాదు.. కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోర‌ని అంటారు. సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పైనే కేసులు పెట్టించి బొక్క‌లో వేయించిన నాయ‌కుడిగా బొల్లా పేరు ఇప్ప‌టికీ వినిపిస్తుంది. దీంతో స్థానికంగా వైసీపీ కీల‌క నాయ‌కులు ఆయ‌న‌ను దూరంగా పెట్టారు. దీనికితోడు.. ఎంపీ, ఇత‌ర ఎమ్మెల్యేలు కూడా బొల్లాకు దూరంగానే ఉంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో బొల్లాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మేననే సంకేతాలు వ‌చ్చాయి. దీనిని గుర్తించిన ఆయ‌న ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో అడుగ‌డుగు తిరుగుతున్నారు.

పెళ్ల‌యినా.. చావైనా.. ఆయ‌న వ‌చ్చి వాలిపోతున్నార‌ట‌. అంతేకాదు.. ఎవ‌రు పిలిచినా.. పిల‌వ‌క‌పోయినా.. గృహ ప్ర‌వేశాలు.. పెళ్లిళ్ల‌కు వెళ్లి కానుక‌లు ఇచ్చేస్తున్నారు. ఇక‌, ఎవ‌రైనా చ‌నిపోతే.. అక్క‌డికి వెళ్లి నివాళు ల‌ర్పించ‌డం.. ఆర్థికంగా అంతో ఇంతో సాయం చేస్తున్నార‌ట‌. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన దూకుడు తొల‌గిపోయి.. త‌న‌కు సానుకూల ప‌వ‌నాలు వీస్తాయ‌ని.. ఆయ‌న అనుకుంటున్న‌ట్టు భావిస్తున్నార‌ట‌. అయితే.. ఇదంతా కూడా అధిష్టానం చాలా నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

చేయాల్సిన జిమ్మిక్కులు చేసేసి.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటే.. మాత్రం.. కుద‌ర‌ద‌ని.. తాము చేయించిన స‌ర్వేల్లో.. మార్కులు ప‌డితేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని.. తాజాగా మ‌రోసారి.. అధిష్టానం నుంచి ఎమ్మెల్యేల వాట్సాప్‌ల‌కు సందేశాలు వ‌చ్చాయ‌ట‌. ఈ ప‌రిణామాల‌తో ఎమ్మెల్యే బొల్లా.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇప్పుడు ఏం చేయాల‌నేది ఆయ‌న ముందున్న పెద్ద టాస్క్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎగిరెగిరి ప‌డిన ఆయ‌న ఇప్పుడు కిందికి దిగినా.. ఫ‌లితం ద‌క్కేలా లేద‌ని ఆయ‌న అనుచ‌రులే అంటుండ‌డం గ‌మ‌నార్హం.