జగన్.. లిక్కర్ కింగ: కేంద్ర మంత్రి

రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర‌స్థాయిలో నిప్పు లు చెరిగారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోయిందని ధ్వజమెత్తారు.

ఎన్నికలకు ముందు ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరుల న్నింటినీ దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయన్నారు.  

“ఏపీలో మా ప్రభుత్వం వచ్చాక అన్ని మాఫియాల ఆట కట్టిస్తాం. అవినీతిలో ఏపీది నాలుగో స్థానం, తెలంగాణది రెండో స్థానం. మోడీ ప్రభుత్వం ఏపీకి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదు. ఒక్క రాజధానికే డబ్బు లేదు.. 3 రాజధానులు ఎలా కడతారు?. జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారు.“ అని అనురాగ్ నిప్పులు చెరిగారు.