ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణలో భాగంగా ఇక్కడి రైతులు మరోసారి పాదయాత్రకు ఉపక్రమించారు. గతంలో తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరంపరలో మరోసారి సెప్టెంబర్ 12 నాటికి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతుల నిరసనలు వెయ్యి రోజులకు చేరుకున్న సందర్భంగా, ఐక్య కార్యాచరణ నేతలు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. రైతు పరిరక్షణ సమితి నేతలు మరోమారు పాదయాత్ర చేపడతామని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన యాప్ను ఆవిష్కరించారు.
తుగ్లక్ ప్రభుత్వాన్ని గద్దె దించకుంటే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ విధానాలను కోర్టులు తప్పు పట్టినా.. మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మలివిడత మహాపాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. సీఎం స్వలాభం కోసమే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
హైకోర్టు తీర్పు తర్వాత కూడా పార్లమెంట్లో వైసీపీ ఎంపీ చేత ప్రయివేటు బిల్లు పెట్టించటం మహా తుగ్లక్ నిర్ణయం అంటూ ధ్వజమెత్తారు. రెండో విడత పాదయాత్ర ఆవశ్యకతను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొనేవారు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆవిష్కరించారు. ‘రాష్ట్రాన్ని రక్షించుకుందాం – రాజధానిని కాపాడుకుందాం’ నినాదంతో అమరావతి రెండో విడత పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
అమరావతి నుంచి అరసవల్లికి సెప్టెంబర్ 12నుంచి రెండో విడత మహాపాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు. రెండు రోజుల్లో పాదయాత వివరాలను డీజీపీకి అందచేస్తామన్నారు. డీజీపీ స్పందనను బట్టి తదుపరి చర్యలుంటాయని రైతు నేతలు స్పష్టం చేసారు. అమరావతే ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటిస్తే.. తమ ఆందోళనలు, నిరసనలు విరమించుకుంటామని నేతలు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates