జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ నెల 20న సీఎం జగన్ సొంత జిల్లా.. కడపలో అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్లుగా పవన్ .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి రూ.10 కోట్ల మేరకు నిధులు కూడా పంచుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికీ..రూ.10 లక్షలు చొప్పున.. పవన్ బాధిత కుటుంబాలకు అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు.. గుంటూరు జిల్లాలోనూ..పర్యటించిన ఆయన.. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కౌలు రైతులకుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అంతేకాదు.. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సిద్ధవటం ప్రాంతంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ సభను రాజకీయంగానే కాకుండా.. సెంటిమెంటు రూపంలోనూ.. సక్సెస్ చేయాలనేది జనసేన వ్యూహం గా కనిపిస్తోంది. అయితే.. ఈ సభలో పవన్ ఏం మాట్లాడనున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా వైసీపీ నేతలు.. ఈ సభపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. పవన్ కేవలం రైతుల సమస్యలపైనే ఫోకస్ చేస్తారా.? లేక.. జగన్‌పైనా గురిపెడతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉంది. మరికొన్ని చోట్ల మాత్రం లేదు.
ఈ నేపథ్యంలో పవన్ ఏయే అంశాలు ప్రస్తావిస్తారనేది ప్రధానంగా ఆసక్తిగా మారింది. అదేసమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆయన కుమార్తె పడుతున్న కష్టాలను కూడా పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్న రాజకీయాలపైనా.. పవన్ కామెంట్లు చేస్తారని.. వైసీపీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ సభకు ఇతర పార్టీల కంటే కూడా.. వైసీపీలోనే ఎక్కువగా టెన్షన్ పెరగడం గమనార్హం.