అభిమానులు కూడా ఎదిగిపోయారండోయ్

మ‌న అభిమానులు కూడా ఎదిగిపోయారండోయ్
ఒక‌ప్పుడు త‌మిళ సినిమా చాలా ఉన్న‌త స్థాయిలో ఉండేది. దాన్ని అందుకోవ‌డానికి తెలుగు సినిమాలు క‌ష్ట‌ప‌డుతుండేవి. కానీ గ‌త కొన్నేళ్ల‌లో మొత్తం క‌థ మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా దేదీప్య‌మానంగా వెలిగిపోతోంది. అంద‌రూ మ‌న సినిమాల వైపే చూస్తున్నారు. మ‌న ప్ర‌మాణాల‌ను అందుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. తెలుగు సినిమాల ముందు త‌మిళ చిత్రాలు వెల‌వెల‌బోతున్నాయ‌నే చెప్పాలి.

ఐతే కేవ‌లం ఇండ‌స్ట్రీ మెరుగు ప‌డితే స‌రిపోతుందా? అభిమానులు కూడా ఎద‌గాలి క‌దా? వాళ్లు కూడా ఎదిగిపోతున్నారు. కాక‌పోతే వాళ్ల డైరెక్ష‌న్ మాత్రం వేరు. సోష‌ల్ మీడియాలో జుగుప్సాక‌ర‌మైన రీతిలో ఫ్యాన్ వార్స్ చేసుకోవ‌డంలో త‌మిళ అభిమానుల‌దే ఇప్ప‌టిదాకా పైచేయిగా ఉండేది. ముఖ్యంగా అక్క‌డ విజ‌య్, అజిత్ అభిమానులైతే మ‌రీ దారుణంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అవ‌త‌లి హీరోల‌ను కించ‌ప‌రుస్తుంటారు.

వాళ్ల‌ను చూసి అంద‌రూ అస‌హ్యించుకునే ప‌రిస్థితి ఉండేది. ఫ్యాన్ వార్స్ విష‌యంలో వాళ్ల‌ను మించి వ‌ర‌స్ట్ ఎవ‌రూ ఉండ‌రు అనిపించేది. కానీ ఇప్పుడు త‌మిళ అభిమానులను తెలుగు ఫ్యాన్స్ వెన‌క్కి నెట్టేస్తున్నారు. అర‌వోళ్ల‌ను మించిన దిగ‌జారుడుత‌నంతో దారుణాతి దారుణ‌మైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ప‌ర‌స్ప‌రం హీరోల‌ను కించ‌ప‌రుచుకుంటున్నారు. అందులోనూ తాజాగా హాట్ టాపిక్‌గా మారిన ఫ్యాన్ వార్.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య కావ‌డం గ‌మ‌నార్హం.

మెగా ఫ్యామిలీలో ఎంతో స‌న్నిహితంగా మెలిగే రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల మీద వారి అభిమానులు ప‌ర‌స్ప‌రం దారుణ‌మైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దిగ‌జారుడు ట్వీట్లు వేస్తున్నారు నిన్న‌ట్నుంచి. ఆ హ్యాష్ ట్యాగ్స్ ఇక్క‌డ రాయ‌డానికి, వాటి గురించి వివ‌రించ‌డానికి కూడా చాలా ఇబ్బంది ప‌డే స్థాయిలో అవి ఉన్నాయి. ఈ దిగ‌జారుడు ట్వీట్లు విష‌యంలో మ‌ళ్లీ రికార్డుల గురించి కూడా చ‌ర్చ న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం. మీరు 2.5 ల‌క్ష‌ల ట్వీట్లేశారా.. మేం 3 ల‌క్ష‌లేశాం అని తొడ‌లు కొట్టుకుంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన హీరోల అభిమానుల్లో ఇంత‌టి విద్వేషం నెల‌కొన‌డం షాకింగే.