రాజ్ భవన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం?

రాజ్ భవన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక విషయం అర్ధమవుతోంది. అదేమిటంటే రాజ్ భవన్ను కేసీయార్ బహిష్కరించినట్లు. గవర్నర్ నివాసముండే రాజ్ భవన్లో ఏ కార్యక్రమం జరిగినా దానికి హాజరు కాకూడదని కేసీయార్ నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకనే ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు.

స్వాతంత్ర వేడుకలు అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం రాజభవన్లో ఎట్ హోం నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. గవర్నర్ ఇచ్చే పార్టీకి ముఖ్యమంత్రితో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు, ప్రతిపక్షాల కీలక నేతలు, ఉన్నతాధికారులు, మీడియాను కూడా ఆహ్వానించటం సాధారణమే. స్వయంగా గవర్నర్ ఇస్తున్న పార్టీ కాబట్టి దాదాపు ఎవరూ మిస్సవరు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి 7 గంటలకు కేసీయార్ ఎట్ హోం కు హాజరవుతారని సీఎంవో గవర్నర్ కార్యాలయానికి సాయంత్రం 5 గంటలకు సమాచారమిచ్చింది.

అయితే తర్వాత ఏమైందో తెలీదు రాత్రి 7.10 గంటలకు ఎట్ హోం కు సీఎం రావాటం లేదని సీఎంవో రాజ్ భవన్ దగ్గర బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం పంపింది. అదే సమాచారాన్ని పోలీసు అధికారులకు గవర్నర్ కార్యాలయానికి చేరవేశారు. తాజా పరిణామంతో గవర్నర్-కేసీయార్ మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతోందన్న విషయం అర్ధమైపోతోంది. రాజ్ భవన్లో జరిగిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి మాత్రమే కేసీయార్ హాజరయ్యారు. అది కూడా కార్యక్రమం అయిపోగానే సీఎం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు.

కేసీఆర్ తో గ్యాప్ తగ్గించుకుందామని గవర్నర్ తమిళిసై చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దాంతో గవర్నర్ విషయంలో ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటం లేదు. ఇపుడు జరిగిన ఎట్ హోంకు కూడా కేసీయార్ రాలేదు కాబట్టి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు ఎవ్వరూ వెళ్ళలేదు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారులు మాత్రమే హాజరయ్యారు.