జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద జోక్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ తాను అనుకుంటే 2009లోనే ఎంపీ అయిపోయేవాడనన్నారు. తనకు పదవే ముఖ్యమని అనకుంటే ప్రధానమంత్రిని పదవి కావాలని అడిగే చొరవ తనకుందని చెప్పటమే పెద్ద జోక్. ఎంఎల్ఏగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ తాను ఎంపీగా అయిపోయేవాడనని చెబితే ఎవరైనా నమ్ముతారా ?
ఒక్కసారైనా ఎంఎల్ఏగా గెలిచుంటే అప్పట్లో ఎంపీ అయిపోయేవాడిని అని చెప్పుకున్నా జనాలు నిజమే కాబోలు అనుకునేవారు. 154 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పార్టీ ముక్కి మూలిగి గెలిచింది ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే. అది కూడా అభ్యర్ధి రాపాక వరప్రసాద్ సొంతబలంతో రాజోలులో గెలిచారు. తనకు ఎదురేలేదని పదే పదే చెప్పుకునే పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు.
2009లోనే ఎంపీ అయిపోయేవాడిని అని చెప్పిన పవన్ ఎలా అయ్యేవారో మాత్రం చెప్పలేదు. 2009లోనే అంటే అప్పట్లో అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరపుననే అర్ధమవుతోంది. మరదే నిజమైతే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు ? బావ అల్లు అరవింద్ అనకాపల్లిలో ఎంపీగా, సోదరుడు చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో ఎంఎల్ఏగా పోటీచేసినపుడు పవన్ ఎంపీగా పోటీచేస్తానంటే వద్దనే వారా ? పైగా తనకు పదవి కావాలని ప్రధానమంత్రిని అడిగేంత చొరవ తనకుందని చెప్పుకున్నారు. 2009లో ప్రధానమంత్రి ఎవరు మన్మోహన్ సింగే కదా. పవన్ అడిగితే మన్మోహన్ పదవి ఎందుకిస్తారు ?
పోనీ 2014లో ఎంపీ పదవి కావాలని నరేంద్రమోడీని ఎందుకడగలేదు ? పదవి కావాలని అడిగేంత చొరవుందని అన్నారంటే రాజ్యసభ ఎంపీ అనేకదా అర్ధం. లోక్ సభకు పోటీ చేయదలుచుకుంటే టికెట్ కోసం పవన్ ఒకరిని అడగాల్సిన అవసరం లేదు కదా. ముందు ఎంఎల్ఏగా గెలిచి తర్వాత ఎంపీ పదవి గురించి మాట్లాడినా అర్ధముంది. ఏదో మైకు దొరికింది కదాని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే జనాలు నవ్వుకుంటారని కూడా పవన్ ఆలోచిస్తున్నట్లు లేదు.