జనసేన పార్టీకున్న అతి పెద్ద బలహీనత.. క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం. ఒక రాజకీయ పార్టీకి అత్యంత అవసరమైంది అదే. క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగకుండా.. ఉన్నత స్థాయిలో ఎంత చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
పార్టీకి ఊపు వచ్చినా.. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి, కార్యకర్తల్ని మోటివేట్ చేయడం.. తరచూ సమావేశాలు నిర్వహించడం.. ఉన్నత స్థాయి నాయకత్వంతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం.. జనాలతో సంబంధాలు నెరపడం.. వాళ్లను ప్రభావితం చేయడం చాలా అవసరం. అది జరగనంత కాలం పార్టీ బలపడదు.
గత ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురవడానికి ఇదే అత్యంత ముఖ్యమైన కారణం. ఈ విషయం అర్థం చేసుకుని ఇప్పుడైనా క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం గురించి అగ్ర నాయకత్వం ఏమైనా ఆలోచిస్తుందా అని పార్టీ మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు.
ఐతే ఈ దిశగా పెద్ద అడుగు వేసేందుకు జనసేన సన్నద్ధమైనట్లే ఉంది. ఓ టీవీ చర్చలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. జిల్లాకు 9 వేలమందితో జనసైనికుల్ని ఎంపిక చేసి వివిధ స్థాయిల్లో కమిటీలను సిద్ధం చేశామని.. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లక్షమందితో ఈ జాబితా తయారైందని.. వీరి ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి, అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రచించామని ఆయన వెల్లడించారు.
కరోనా లేకుంటే ఎప్పుడో కమిటీలు ప్రకటించేవాళ్లమని.. కార్యక్రమాలు కూడా జరిగేవని.. లాక్ డౌన్ వల్ల ఆగామని ఆయన తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాక ఈ కమిటీల ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు. ఇదే నిజమైతే జనసేన కార్యకర్తలకు మంచి ఊపు రాబోతున్నట్లే, పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కాబోతున్నట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates