వైసీపీకి ఓటేయకపోతే పాపం తగులుతుంది: మంత్రి

ఏపీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు టీడీపీ పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా వైసీపీ నాయ‌కులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ఈ గ‌డ‌ప‌గ‌డప కార్య‌క్ర‌మం అత్యంత ర‌భ‌స‌గా మారుతోంది.

అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓ మహిళకు శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించకపోతే పాపం తగులుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సాయం గురించి ప్రజలకు వివరించారు. ఆ క్రమంలోనే.. ప్రభుత్వం నుంచి చాలా పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు.

అంతేకాదు.. ఈసారి తనను ఆశీర్వదించాలన్నారు. పోనీ.. అంత‌టితో ఆయ‌న ఆగారా? అంటే.. లేదు. మీరు నాకు ఓటేయ‌క‌పోతే.. పాపం తగులుతుందని ఓ మహిళకు శాపనార్థాలు పెట్టారు. “ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది. అప్పులు చేసి మ‌రీ.. మీరు డ‌బ్బులు ఇస్తున్నాం. మీరు ప్ర‌తిప‌క్షాల మాయ‌లో ప‌డొద్దు. వారు చెప్పే మాట‌లు వినొద్దు. న‌మ్మొద్దు. నా మాట వినండి. నేను మీకు ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించా. ప్ర‌భుత్వం కూడా సంక్షేమంపేరుతో డ‌బ్బులు ఇస్తోంది. మీ ఓటు నాకే వేయండి“ అని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ‌.. “అదేంటి సార్‌.. ఇప్పుడే ఓట్లు అడుగుతున్నారు. అప్పుడే ఎన్నిక‌లు రాలేదుగా!` అని ప్ర‌శ్నించే స‌రికి.. మంత్రి షాక్ కు గుర‌య్యారు. ఆ వెంట‌నే తేరుకుని.. “అలా కాదు.. మీరు ఆళ్ల మాట‌లు.. ఈళ్ల మాట‌లు విని.. నాకు ఓటేయ‌రేమోన‌ని చెబుతున్నా. మీ ఓటు నాకే.. వేయాలి. వేయ‌పోతే.. మీ యిష్టం.. మీకే పాపం త‌గులుతుంది“ అని మంత్రి వ్యాఖ్యానించారు.