మునుగోడు ‘రిజ‌ల్ట్’.. ఎవ‌రికి అనుకూలం?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ, తెర‌వెనుక .. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఆయ‌న రేపో మాపో.. బీజేపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయ‌న బీజేపీ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యేగా కొన‌సాగవ‌చ్చు. ఎవ‌రూ ఆయ‌న‌కు అభ్యంత‌రం చెప్ప‌రు.

ఎందుకంటే.. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన చాలా మంది నాయ‌కులు అధికార పార్టీలో చేరి.. మంత్రి ప‌ద‌వులు సైతం పొందారు. వారు త‌మ ఎమ్మెల్యే స్థానాల‌కు రాజీనామా చేయ‌లేదు. కానీ, ఇప్పుడు.. రాజ‌గోపాల్ మాత్రం రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. మునుగోడు ఫ‌లితం ఎవ‌రికి అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంటుంది? అనేది పెద్ద చ‌ర్చ‌. ఎందుకంటే.. మునుగోడులో రాజ‌గోపాల్ రాజీనామా చేసినంత మాత్రాన ఆయ‌న‌పై సింప‌తీ .. వ‌స్తుంద‌ని అనుకునే ప‌రిస్థితి లేదు.

అదేస‌మ‌యంలో ఇక్క‌డ బీజేపీ కూడా బ‌లంగా లేదు. గ‌తంలో టీఆర్ఎస్‌.. తర్వాత కాంగ్రెస్ పార్టీలే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. 1967 నుంచి జ‌రిగిన ఎన్నిక‌లు గ‌మ‌నిస్తే.. పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. వ‌రుస‌గా కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. క‌మ్యూనిస్టులు వ‌రుస‌గా విజ‌యం సాధించారు. 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ క‌మ్యూనిస్టులు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మాత్రం.. టీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది. 2014లో బీజేపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసిన‌.. గంగిడి మ‌నోహ‌ర్‌రెడ్డి కేవ‌లం 27 వేల ఓట్లు మాత్ర‌మే సాధించారు.

ఇక‌, 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర‌ఫున కోమటిరెడ్డి రాజ‌గోపాల్ విజ‌యం సాధించారు. అయితే.. ఈయ‌న కేవ‌లం 22 వేల 552 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన కె. ప్ర‌భాక‌ర్‌రెడ్డి 74 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్ప‌టికిప్పుడు.. ఉప పోరు క‌నుక వ‌స్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే హోరా హోరీ పోరు ఉండే అవ‌కాశమే ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. బీజేపీకి ఇక్క‌డ ఓటు బ్యాంకు శూన్యం.

పోనీ.. హుజూరాబాద్ మాదిరిగా.. అక్క‌డ ఈట‌ల వ‌రుస విజ‌యాలు సాధించిన‌ట్టుగా.. ఇక్క‌డేమీ.. కోమ‌టిరెడ్డి.. వ‌రుస‌గా పోటీ చేసింది లేదు.. ఆయ‌న గెలిచింది కూడా లేదు. దీంతో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ వ‌ర్గం మ‌ధ్యే మ‌రోసారి పోటీ ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే.. కోమ‌టిరెడ్డి సింప‌తీ ఏమైనా ప‌నిచేస్తుందా? అంటే.. ఆయ‌న‌ను ఎవ‌రూ కాంగ్రెస్‌లో ప‌క్క‌న పెట్టింది లేదు.. ఆయ‌న‌ను పొమ్మ‌ని పొగ‌బెట్టింది అంత‌క‌న్నా లేదు. అంటే.. సింప‌తీకి కూడా(ఈట‌ల మాదిరిగా) అవ‌కాశం లేదు. ఇలా.. ఎటు వైపు చూసుకున్నా.. కోమ‌టిరెడ్డి గెలుపున‌కు అంత ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.