సీఎం జ‌గ‌న్ పెన్ను విలువ ఎంతో తెలుసా?

ఏపీ సీఎం జ‌గ‌న్ కు చిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. మంగ‌ళ‌వారం ఆయ‌న వ‌ర‌ద ప్ర‌భావితం ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఇళ్ల‌కు వెళ్లి బాధితుల‌ను క‌లిశారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారితో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించి.. ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ ఎత్తుకున్న త‌న చిన్నారిని సీఎం జ‌గ‌న్ ముద్దాడారు. అక్క‌డితో ఆగ‌కుండా.. ఆయ‌న ఆ చిన్నారిని త‌న ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. అలానే ఉండి.. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై స్పందించారు.

అయితే.. చిన్నారి ఏం చేశాడంటే.. సీఎం జ‌గ‌న్ జేబును త‌డిమాడు. ఆ చిన్నారి చేతికి జ‌గ‌న్ జేబులో పెన్ను క‌నిపించింది. ఇంకే ముంది.. చిన్నారి.. దానిని తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ముందు చేతికి అంద‌క‌పోయినా.. త‌ర్వాత‌.. రెండు చేతుల‌తోనూ ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో దీనిని గ‌మ‌నించిన చిన్నారి త‌ల్లి.. అత‌డిని వారించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. ఇంత‌లోనే ఆ చిన్నారి సీఎం జ‌గ‌న్ జేబులో ఉన్న పెన్నును లాగేయ‌డంతో అది కాస్తా కింద ప‌డింది.

దీంతో ప‌క్క‌నే ఉన్న అధికారులు.. వెంట‌నే స్పందించి.. స‌ద‌రు పెన్నును తీసి.. సీఎంకు అందించారు. ఆ పెన్నును సీఎం జ‌గ‌న్ ఆ చిన్నారికే బ‌హూక‌రించారు. ఇదీ.. స్టోరీ.. అయితే.. ఇందులో వింతేముంది? అంటున్నారా? క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్ వాడే ఆ పెన్ను ఖ‌రీదు.. ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. స‌ద‌రు పెన్నుపై నెటిజ‌న్లు జోరుగా సెర్చ్ చేశారు.

ఈ క్ర‌మంలో ఈ కామ‌ర్స్ పోర్ట‌ల్ అమెజాన్‌లో విక్ర‌యానికి ఉంచిన ఆపెన్ను.. మౌంట్ బ్లాంక్‌-145 మేస్ట‌ర్ స్టిక్ క్లాసిక్ గోల్డ్ ఫౌంటెన్ పెన్‌. దీని ఖ‌రీదు అక్ష‌రాలా 69,999(అది కూడా డిస్కౌంట్‌తో) రూపాయ‌లు. దీని అస‌లు ఖ‌రీదు 75999 రూపాయ‌లు. బంగారు పాళీతో త‌యారు చేసిన ఈ పెన్నును సీఎం వినియోగిస్తార‌ని తెలుసుకుని.. నెటిజ‌న్లు అవాక్క‌య్యారు. ఇక‌, ఈ పెన్నును సొంతం చేసుకున్న చిన్నారి త‌ల్లి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదీ.. సంగ‌తి!!