కేసీఆర్‌.. మూడు రోజుల ఢిల్లీ టూర్‌.. అందుకేనా?

ఊర‌క‌రారు మ‌హానుభావులు.. అన్న చందంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ఫైర్ బ్రాండ్ ఎక్క‌డికైనా వెళ్తే.. కొంత అర్ధం ప‌ర‌మార్థం లేకుండా.. ఉండ‌దు క‌దా! ఇదే.. ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసింది. తాజాగా కేసీఆర్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీలో కాలు మోపారు. ఆయ‌న వెంట మ‌రికొంద‌రు వెళ్లారు.. స‌రే.. అస‌లు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లార‌నేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌. కొన్ని వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్ష నేత‌ల మ‌ధ్య చీలిక స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో అనుకున్న విధంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.

అంటే.. విప‌క్షాలు నిల‌బెట్టిన య‌శ్వంత్ సిన్హాకు విప‌క్షాల‌లోని కొన్ని పార్టీల అభ్య‌ర్థులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు) ఓటేయ‌లేదు. పోయి పోయి.. బ‌హిరంగంగానే చెప్పి.. ముర్మును గెలిపించారు. ఇది.. మోడీ విజ‌యంగా బీజేపీ ప్ర‌చారం చేసుకుంది. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త లేద‌ని.. ఎన్ని పార్టీలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. మోడీ హ‌వాకు తిరుగులేద‌ని బీజేపీ ప్ర‌క‌టించుకుంది. ఈ నేప‌థ్యంలో జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు.. ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. పైగా మోడీపై తొడ‌గొడుతున్న ఆయ‌న.. ఇలాంటివి తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు మౌనంగా ఉంటే కుద‌ర‌దు క‌దా!

అందుకే చేతిలో ఉన్న మ‌రో అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని.. మోడీపై విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నానే ది ప‌రిశీల‌కుల మాట‌. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్ష కూట‌మి బ‌ల‌ప‌రిచిన మార్గ‌రేట్ ఆళ్వాకు అనుకూలంగా ఓట్లు ప‌డేలా.. ఆయ‌న కీల‌క చ‌ర్చ‌లు చేయ‌నున్నార‌ని అంటున్నారు. ముఖ్యంగా బెంగాల్‌, ఢిల్లీ ప్ర‌భుత్వాల సీఎంల‌తో కేసీఆర్ ఈవిష‌యంపై చ‌ర్చించి.. కాంగ్రెస్‌తో వారికి ఉన్న విభేదాల‌ను ప‌క్క‌న పెట్టేలా ప్ర‌య‌త్నించ‌ను న్నార‌నేది ప్ర‌స్తుత విష‌యం.

ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంటు స‌మావేశాల్లో త‌మ పార్టీ ఎంపీల‌కు కేసీఆర్ ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు. అయితే.. వారికి ఈ మూడు రోజుల పాటు మ‌రింతగా కొన్ని విష‌యాల‌పై ఒత్తిడి తెచ్చి.. వారు దూకుడుగా ముందుకు సాగేలా చేయాల‌నేది కేసీఆర్ ఉద్దేశంగా ఉంద‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో జాతీయ మీడియాను స‌మ‌న్వ‌యం చేయ‌డం కూడా కేసీఆర్ అజెండాలో కీల‌క భాగంగా ఉందని గుస‌గుస వినిపిస్తోంది. జాతీయ‌స్తాయి రాజ‌కీయాల్లో పుంజుకోవాలంటే.. మీడియా స‌హ‌కారం అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఒక‌సారి ఆయ‌న మీడియాతో చ‌ర్చించారు. ఇక‌పై మ‌రింత‌గా త‌న‌కు స‌హ‌క‌రించేలా.. మీడియాను కోరే అవ‌కాశం ఉంద‌ని.. తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో వ్య‌వ‌సాయానికి సంబంధించి రైతుల సంఘాల‌తోనూ ఆయ‌న జాతీయ‌స్థాయిలో ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ చేస్తున్నార‌ని మ‌రో వార్త వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో టికాయ‌త్‌తో మ‌రోసారి భేటీకి కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచా రం. ముఖ్యంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పైనే కేసీఆర్ ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంటుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌. ఈ ద‌ఫా గురి త‌ప్ప‌కుండా.. మోడీకి భంగం క‌లిగించాల‌ని.. అతి త‌క్కువ మెజారిటీతో బీజేపీ అభ్య‌ర్థి ధ‌న్‌క‌డ్‌ను నిలువరించేలా చూడాల‌ని.. కేసీఆర్ వ్యూహంగా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.