ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను అప్పుడు చెప్పాను. నా మాట విని ఉంటే.. ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు. కానీ, నామాట నువ్వు వినలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వ తప్పును కేంద్రం, పీపీఏ, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. కాంట్రాక్టర్‌ను మార్చవద్దని పీపీఏ, జలవనరులశాఖ చెప్పినా వైసీపీ ప్రభుత్వం వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం నిర్మాణం ఆలస్యం కావటంపై కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిపుణుల కమిటీల వరకూ అన్నీ వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నందున ఇప్పుడేం సమాధానం చెబుతారని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను నిలదీశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం పరిహారంపై నాటి హామీలు ఏమయ్యాయని జగన్ సర్కారును ప్రశ్నించారు. పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చవద్దని పీపీఏ, కేంద్ర జలనరుల శాఖ రాసిన లేఖలను, చేసిన హెచ్చరికలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
గోదావరి వరద బాధితులను ఆదుకోవటంలోనూ ప్రభుత్వం నూరు శాతం విఫలమయ్యిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 2014 నుంచి ఎలాంటి ఇబ్బందులు లేని విలీన గ్రామాలు.. ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘పేదలకు ఇచ్చింది జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు’ అని ఎద్దేవా చేశారు. విలీనం పేరుతో రాష్ట్రంలో బడులు మూసేస్తున్న ప్రభుత్వం.. బార్లు మాత్రం తెరుస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ విద్యాశాఖ దారుణంగా విఫలం అయ్యిందని మండిపడ్డారు.
రాష్ట్రంలోని మెుత్తం 1.42 కోట్ల లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో ప్రభుత్వం సమాధానం పెద్ద బూటకమన్న చంద్రబాబు.., విశ్వసనీయత ఉంటే శ్వేతపత్రం విడుదల చేయ్యాలన్నారు. అదాన్ డిస్టలరీకి రెండేళ్లలోనే రూ.2,400 కోట్ల విలువైన ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఈడీ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates