తమిళనాట సంచలనం రేపిన తండ్రీ కొడుకులు జయరాజ్, ఫీనిక్స్ల లాకప్ డెత్ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును విచారించేందుకు జడ్జి నేతృత్వంలో హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ జడ్జి విచారణ కోసం శాతంకులం పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడి పోలీసులెవ్వరూ ఆయనకు సహకరించకపోవడంతో ఆ పోలీస్ స్టేషన్ను మీ అధీనంలోకి తీసుకోండంటూ రెవెన్యూ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్కు అప్పగించడం తెలిసిన సంగతే. ఐతే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి జడ్జి సమర్పించిన నివేదికే కారణం. ఆ నివేదికలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఓ మహిళా పోలీసు ముందుకొచ్చింది.
ఐతే ఆమెను వాళ్లందరూ తీవ్రంగా భయపెట్టారని.. ఐతే జడ్జి ఆమెను అనునయించి భయం పోగొట్టి వాంగ్మూలం తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. విచారణలో భాగంగా పోలీసుల్ని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వలేదని.. పెడసరంగా మాట్లాడారని.. సహకరించే ఉద్దేశం లేనట్లుగా హావభావాలు ఇచ్చారని.. ఒక కానిస్టేబుల్ అయితే.. మీరు నన్నేమీ చేయలేరంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని జడ్జి నివేదికలో పేర్కొన్నారు. ఇక స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ కోసం ప్రయత్నించగా.. ఏ రోజుకు ఆరోజు ఫుటేజీ అంతా డెలీట్ అయిపోయేలా సెట్టింగ్స్ మార్చేశారని.. సిస్టంలో భారీగా మెమొరీ ఉన్నప్పటికీ.. ఇలా ఫుటేజీ ఏ రోజుకు ఆరోజు వెళ్లిపోయేలా సెట్టింగ్స్ పెట్టడంలో పోలీసుల ఆంతర్యమేంటో అర్థమవుతోందని జడ్జి నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదిక చదివిన హైకోర్టు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేషన్ను రెవెన్యూ సిబ్బంది అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.