వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. అందుకనే ముగ్గురు అభ్యర్ధులను కూడా ప్రకటించేశారు. మరి ప్రతిపక్షాలు ఏమి చేస్తాయి ? ప్రతిపక్షాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే మిగిలిన పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఉన్నాయంటే ఉన్నాయంతే. వచ్చే మార్చిలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ద్వారా భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఒక నియోజకవర్గం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గం రెండోది కాగా మూడోది అనంతపురం, కర్నూలు, కడప నియోజకవర్గం. ఈ మూడు నియోజకవర్గాలకు జగన్ అభ్యర్ధులను కూడా ప్రకటించేశారు. ఎన్నికలకు ఇంకా 8 మాసాలుంది కాబట్టి ఓటర్లలోకి వెళ్ళేందుకు అభ్యర్ధులకు కావాల్సినంత సమయం పుష్కలంగా ఉంది.
మరిదే సమయంలో టీడీపీ, జనసేన ఏమిచేస్తాయన్నదే కీలకంగా మారింది. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయా ? లేకపోతే విడివిడిగా పోటీ చేస్తాయా అన్న విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. ప్రస్తుతం బీజేపీ+జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని అనుకోవటం లేదు. టీడీపీని వదిలేసినా జనసేనకు క్షేత్రస్ధాయిలో ఉన్న ఆదరణ ఎంత అన్న విషయంలో ఒక క్లారిటి వచ్చేస్తుంది. నిజానికి ఈ ఎన్నికల్లో గెలుపోటములతో వచ్చే ఎన్నికల విషయంలో జోస్యం చెప్పేందుకు లేదు.
కాకపోతే మూడ్ ఆఫ్ ది పీపుల్ ఏమిటి అని అంచనా వేసుకునేందుకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే అవటానికి మూడుస్ధానాలే అయినా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను కవర్ చేస్తుంది. పైగా అర్బన్ ఏరియా అందులోను చదువుకున్న వారి ఓట్లే కావటంతో కాస్త జనం పల్స్ తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయంతే. ఈ ఎన్నికలు మూడుపార్టీలకు కూడా ప్లస్సులుగాను మైనస్సులుగాను ఉపయోగపడుతుంది. ఓడిపోతే ఎక్కడ మైనస్ అయ్యింది, గెలిస్తే ఏ కారణాలతో గెలిచామో విశ్లేషించుకునేందుకు ఉపయోగపడుతుంది. మరి టీడీపీ, జనసేనలు ఏమిచేస్తాయో చూడాలి.