అనంతపురానికి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ..సంచలనంగా మారాయి. పార్టీ తరపున ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ ఆదేశాల మేరకు నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల మధ్య ఉంటున్నారు. దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. ఎట్టి పరిస్థితిలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి తీరాలని.. దీనిని బట్టే మార్కులు ఉంటాయని.. టికెట్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు.
అంతేకాదు.. టికెట్లు ఇవ్వకపోతే..తన బాధ్యత ఏమీలేదని కూడా సీఎం కుండబద్దలు కొట్టారు. దీంతో ఎమ్మెల్యేలు.. కాలికి బలపం కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలకు ప్రజల నుంచి ఎదురు గాలి వీస్తోంది. తీవ్ర స్థాయిలో వారి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణకు భారీగా సెగ తగిలింది.
ఓ మహిళ అత్యంత దారుణంగా తిట్టిపోసింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా.. విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మాజీ మంత్రి శంకర నారాయణ.. ఇదే విషయాన్ని సలహా దారు.. సజ్జలకు విన్నవించారని సమాచారం. తాను ఈ కార్యక్రమం చేయలేనని.. చేయాలంటే.. ఇబ్బందులు వస్తున్నాయని.. ఆయన చెప్పారట. దీని పై స్పందించిన సలహాదారు.. ఏదేమైనా.. గడపగడపకు కార్యక్రమానికి వెళ్లాల్సిందేనని.. ఈ విషయంలో రెండో మాటలేదని అన్నారని.. శంకరనారాయణ అనుచరులు చెబుతున్నారు.
అయితే.. తాజాగా జరిగిన ఘటనతో.. శంకర నారాయణ తీవ్రంగా కలత చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక మీదట గడపగడపకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఇష్టమేనని.. చేసింది చాలని.. ఇంకా ప్రజలతో మాటలు ఎందుకు పడాలని..ఆయన అంతర్గత చర్చల్లో నాయకుల వద్ద.. కార్యకర్తల వద్ద ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గడపగడపకు కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో కార్యకర్తలు చేయాలంటే చేసుకోవచ్చని.. ఆయన సూచించారట. మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates