ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. చుట్టూ.. ఇప్పుడు ప్రశ్నలే మిగులుతున్నాయి. వచ్చే ఎన్నికలపై ఆయన క్లారిటీ లేని ప్రకటనలు చేస్తుండడంతో.. పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయకులు కూడా వెనుకడుగు వేస్తున్నారు. అదేసమయంలో ఉన్న నాయకుల్లోనూ.. ఉత్సాహం కనిపించడం లేదు. పవన్ వస్తే.. పండగ. లేకపోతే.. పార్టీ ఊసు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పోనీ.. ఆయన వచ్చిన తర్వాత.. అయినా.. పార్టీపై క్లారిటీతో ఉన్నారా? అంటే.. లేదు. కొంత సేపు పొత్తులు పెట్టుకుంటామని.. చెబుతారు.
గత పార్టీ ఆవిర్భావ వేడుకల్లో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని చెప్పారు. అంటే.. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానని ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో టీడీపీ నుంచి కొంత మేరకు జోష్ కనిపించింది. కనీసం 30 నుంచి 35 సీట్లు జనసేన కు వెళ్లిపోయినా.. మిగిలిన చోట్ల టీడీపీ గెలుచుకున్నా.. బలమైన సంకేతాలు వస్తాయని.. ఫలితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఇటు జనసేన, అటు టీడీపీలు కూడా అంచనా వేసుకున్నాయి. కానీ, ఇంతలోనే వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా కొన్ని డైలాగులు పేల్చారు.
పవన్‌కు దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలని.. చంద్రబాబు కోసమే… పవన్ ఆరాట పడుతున్నారని.. దత్తపుత్రుడిగా.. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు ఆయన పనిచేస్తున్నారని.. వైసీపీ అధినేత సీఎం జగన్ నుంచి మంత్రులు, నాయకుల వరకు కూడా కామెంట్లు చేశారు. కట్ చేస్తే.. ఈ వ్యాఖ్యల ఫలితమో.. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. తర్వాత నుంచి పవన్ టోన్ మార్చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని చెబుతున్నారు.. తానే గెలుస్తానని అంటున్నారు. సీఎం అవుతానని అంటున్నారు. మంచిదే. ఏ పార్టీ అయినా.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగడాన్ని ఎవరూ తప్పుపట్టరు.
కానీ, ఇదే సమయంలో వ్యూహం ఏదీ? నియోజకవర్గాలు, మండలాలు, బూత్ లెవిల్ కార్యకర్తలు.. ఇలా ఎలా చూసుకున్నా.. వీటిపై పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కనిపించడంలేదు. పొత్తు ఉందని అంటే.. ఆటోమేటిక్‌గా పెరిగిన గ్రాఫ్.. తర్వాత.. ఒంటరి అనే సంకేతాలు ఇవ్వడం.. వైసీపీ ట్రాప్‌లో చిక్కుకుంటున్నారనే వాదన బలంగా వినిపించడం తో గ్రాఫ్ అనూహ్యంగా తగ్గిపోయింది. కొన్ని మీడియాల్లోనూ అప్పటి వరకు ఉన్న జనసేనాని ఫాలోయింగ్ తగ్గిపోయింది. వైసీపీకి ఇదే కావాల్సింది. ఏదైతే తాము అంతర్లీనంగా కోరుకుందో.. అదే జరుగుతోంది. మరి ఇదే నిజమైతే.. వైసీపీ ట్రాప్‌లో పవన్ చిక్కుకున్నట్టే కదా! అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల సమయంలో టీడీపీ కూడా ఇలానే వైసీపీ విసిరిన హోదా ఉచ్చులో చిక్కి.. బీజేపీకి దూరమై.. అధికారం పోగొట్టుకుంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.