పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంపై కేంద్రలోని మోడీ ప్రభుత్వం తొలిసారి తీవ్రస్థాయిలో రియా క్ట్ అయింది. పార్లమెంటు వేదిగా.. వైసీపీ సర్కారును కడిగేసింది. “తప్పు మాది కాదు.. ఏపీదే.. ఏపీ చేసింది ముమ్మాటికీ తప్పే.. పోలవరం జాప్యం ఏపీ సర్కారు వల్లే అవుతోంది” అని కేంద్రం తీవ్రస్థాయిలో విమర్శ లు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని.. దానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తా మని తాము హామీ కూడా ఇచ్చామని.. కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆలస్యమైనట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థతో సమన్వయ లోపంతోపాటు.. కరోనా మహమ్మారి కూడా పోలవరం ఆలస్యానికి కారణమయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
పోలవరం విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మా ణం, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పీపీఏ నివేదించినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జులై వరకు సమయం అవసరమని తేల్చింది.
2014నాటి పోలవరం కేటాయింపులపై మరోసారి సమీక్షించేందుకు పీపీఏ ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. తాము ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు జవాబిచ్చారు. మరి కేంద్రమే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత.. వైసీపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో ఎలా.. కవర్ చేస్తుందో చూడాలి.