భ్రమలో ఉన్న ఫ్లాప్ దర్శకుడు

తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఫ్లాపయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడు విగ్నేష్ శివన్ ఇది ఒప్పుకోవడానికి ఎంత మాత్రం సిద్ధపడటం లేదు. పైగా క్రిటిక్స్ వల్లే తన సినిమా ఆడియన్స్ కి దూరమయ్యిందని, ఇప్పుడు చాలా మంది ఓటిటిలో చూసి థియేటర్లో మిస్ అయినందుకు బాధ పడుతున్నామని చెబుతున్నారట. ఇదంతా ఒక పెద్ద స్టోరీగా ఇన్స్ టాలో పెట్టారీయన.

ఇదంతా చూస్తుంటే సదరు డైరెక్టర్ ఎంత భ్రమలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం రివ్యూల వల్ల ప్రభావితం చెంది ఏ సినిమా ఫ్లాప్ అవ్వడమో హిట్ కావడమో జరగదు. మణిరత్నం లాంటి లెజెండరీ తీసిన తగ్ లైఫ్ ఎంత ఘోరంగా బాక్సాఫీస్ వద్ద దెబ్బ తిందో చూశాంగా. వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేసిన రజనీకాంత్ కూలి అందులో సగానికే చెమట చిందించాల్సి వచ్చింది. ఇంతా చేసి హిట్ క్యాటగిరీలోకి రాలేదు. స్టార్ హీరోలు క్యామియోలు చేసినా కూడా.

ఒకవేళ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కంటెంట్ కనక నిజంగా బాగుంటే జనాన్ని ఎవరూ ఆపేవారు కాదు. కరుప్పు తమిళనాడులో మూడు వందల కోట్లు ఎలా వసూలు చేసింది. ఇతర భాషల్లో నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న దృశ్యం 3ని మలయాళ జనాలు నెత్తిన బెట్టుకున్నారు. బామ్మగా రాధికా నటించిన తాయ్ కిళవి వంద కోట్ల దగ్గరకు ఎలా వెళ్లగలిగింది. ఇదంతా మర్చిపోయి విగ్నేష్ తనకేదో అన్యాయం జరిగిందనే తరహాలో పోస్టు పెట్టడం విడ్డూరం.

నిజానికి బంగారం లాంటి అవకాశాన్ని అతనే వృథా చేసుకున్నాడు. ప్రదీప్ లాంటి జెన్ జీ హీరో ఆఫర్ ఇస్తే దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకోవాలి. అంతే తప్ప ఏదేదో తీసి నేను కళాఖండం తీశాను చూడకపోవడం మీ తప్పు అంటే పబ్లిక్ నవ్వుతారు. ఓటిటిలో భారీ వ్యూస్ వచ్చి ఉండొచ్చు. ఇంట్లోనే కాబట్టి థియేటర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా ఫ్లాపులు ట్రెండింగ్ లోకి వస్తాయి. ఎల్ఐకెకు ఈ మాత్రం రెస్పాన్స్ వచ్చిందంటే దానికి కారణం ప్రదీప్ ఇమేజే.