జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలతో సోమవారం నిర్వహించిన సమీక్ష తర్వాత ఇదే విషయం చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంఎల్ఏలందరు హాజరయ్యారు కాబట్టి జగన్ గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరెవరు ఎన్నెన్ని రోజులు కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాన్ని జగన్ నివేదిక రూపంలో చదివి వినిపించారు.
కార్యక్రమంలో తాము పాల్గొంటున్నది లేనిది తెలుసుకునేందుకు జగన్ ఇంత లోతుగా రోజువారి నివేదికలు తెప్పించుకుంటారని బహుశా ఎంఎల్ఏలు ఊహించుండరు. అందుకనే జగన్ ప్రశ్నలకు చాలామంది సమాధానాలు చెప్పుకోలేకపోయారు. హోలు మొత్తంమీద 40 మంది ఎంఎల్ఏల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. అందరి విషయం ఒకఎత్తయితే నెల్లూరు జిల్లాలోని కోవూరు ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం మరోఎత్తుగా ఉందట.
గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రసన్న ఒక్కరోజు కూడా పార్టిసిపేట్ చేయలేదు. అందరు పాల్గొనాల్సిందే అని జగన్ స్పష్టంగా ఒకటికి పదిసార్లు చెప్పిన తర్వాత కూడా ప్రసన్న పట్టించుకోలేదు. ఈ విషయమే ఇపుడు చర్చనీయాంశమైంది. ప్రసన్నతో పాటు ఆళ్ళనాని కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే ఇద్దరికీ ఉన్న తేడా ఏమిటంటే ప్రసన్న పూర్తిగా వివాదాస్పద వ్యక్తి. నోటికేదొస్తే అదల్లా మీడియాలోను, నేతల సమావేశాల్లోను మాట్లాడేస్తుంటారు. ఎంత కంట్రోల్ చేయాలని పార్టీ చూసినా నల్లపురెడ్డి పట్టించుకోవటంలేదు. దీంతో చాలాసార్లు తలనొప్పులొచ్చాయి.
ఎంతో సినియర్ అయిన తనకు జగన్ మంత్రివర్గంలో చోటివ్వలేదనే అసంతృప్తి పెరిగిపోతోందో ఏమో అర్ధం కావటంలేదు. దాన్ని ఇష్టంవచ్చిన రీతిలో బయటపెడుతుంటారు. చూడబోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసేట్లుగా లేరు. ఎంఎల్ఏ వైఖరి చూసిన తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. అందుకనే జగన్ కూడా ప్రసన్నను పెద్దగా పట్టించుకోవటంలేదట. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా పద్దతి మార్చుకుంటారా లేకపోతే తనిష్టమొచ్చినట్లే వ్యవహరిస్తారా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates