ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ అదినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మానవత్వం లేని పాలన అంటే ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చనిపోయిన వారి కుటుంబాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా దారుణం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.
“నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్‌డీఆర్ ఎఫ్ ఖాతాలో జమచెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిది“ అని చంద్రబాబు అన్నారు.
తప్పులు చేస్తున్నదే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందన్నారు. కోవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను కూడా దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కోవిడ్ లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం….ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమేనని నిప్పులు చెరిగారు.
కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలుచెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోవిడ్ తో చిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే.. ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.