‘ఉచితపథకాలు దేశాభివృద్ధి చాలా ప్రమాదకరం’ ..ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య. మోడీ చెప్పిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని ఆర్ధిక, సామాజిక రంగాల నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఈమధ్యనే ఉచిత పథకాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తంచేసింది. కానీ ఉచిత పథకాల హామీలు లేకుండా ఏపార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళగలుగుతుందా ? మిగిలిన పార్టీల సంగతిని పక్కన పెట్టేద్దాం బీజేపీ అయినా ఎన్నికలకు వెళ్ళగలదా ?
మోడీ చిత్తశుద్ది, ధైర్యముంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను నిలిపేస్తామని ప్రకటించాలి. ఉచిత పథకాల అమలు వల్ల ఖజానాలకు వేల కోట్ల రూపాయల భారం పడుతోందన్నది వాస్తవం. ఈ భారం కారణంగానే రాష్ట్రాలు మౌలిక సదుపాయాలు కల్పించటంలోను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాయి.
తమిళనాడు, ఏపీ, తెలంగాణా ఇలా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని లేకుండా ప్రతి రాష్ట్రంలోను ప్రతిపార్టీ ప్రజలను ఆకర్షించేందుకు ఓట్లను కొల్లగొట్టేందుకే ఉచితపథకాలను ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని పార్టీలు అధికారంలోకి రాగానే తెప్పతగలేసినట్లు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తున్నాయి. కొన్ని పార్టీలు తూచా తప్పకుండా పాటించేందుకని ఎక్కడెక్కడి నిధులను ఉచితపథకాలకే ఖర్చు పెడుతోంది. దీని రాష్ట్రాలు అన్నీ విధాలుగా దెబ్బతింటున్నాయి.
ఓట్లు పొందటం కోసం ఉచిత పథకాలు అమలు చేసే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమన్న మోడీ మాటలను ఎవరు కాదనలేరు. ఈ సంస్కృతి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలనే బదులు అసలు ఉచిత పథకాలను ప్రకటించకూడదనే విషయంలో మోడీనే ఎందుకు చొరవ తీసుకోకూడదు. రాజకీయపార్టీలన్నింటినీ పిలిచి ఉచితపథకాలను నిలిపేసేలా ఎందుకు చర్చించకూడదదు. తన ఆలోచనను, ఆందోళనను ముందు తమ పార్టీతోనే ఆచరణలోకి తీసుకురావచ్చు కదా. ఈ ఏడాది చివరలో మొదలయ్యే ఎన్నికల్లోనే ఉచితాలకు మోడీ మంగళం పాడేస్తారా ?