తొందరలోనే జగన్ ‘ప్రజాదర్బార్’

ప్రతిరోజు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మమేకం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నారు. తన క్యాంపు కార్యాలయంలోనే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు చేస్తున్నారు. పరిస్ధితులన్నీ కుదిరితే ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదట్లోనే ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట.

జనాలతో పాటు ప్రజా ప్రతినిధులు, నేతల నుండి వివిధ సమస్యలపై వచ్చే వినతులను పరిశీలించి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆయా శాఖలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీఎంవో నుండి వెళ్ళిన వినతులను ఫాలోఅప్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటుచేయబోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా ఇలాంటి ప్రజాదర్బార్ ను నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ ప్రతిరోజు గంటపాటు జనాలను మాత్రమే కలిసేవారు.

ఇపుడు జగన్ కూడా అదే తరహాలో వారంలో ఐదు రోజులు ప్రజాదర్బార్ ను నిర్వహించాలని అనుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఎలాగూ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఇటు ప్రజలను అటు ప్రజాప్రతినిధులు, నేతలను కూడా కలిసినట్లుంటుందని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజాదర్బార్ ను అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మొదలుపెట్టాలని జగన్ అనుకున్నారు. అయితే పాలనలో పూర్తిగా కుదురుకోకుండానే కరోనా వైరస్ మీద పడటంతో అప్పట్లో చేసుకున్న ప్లానింగ్ దెబ్బ తినేసింది. కరోనా వైరస్ సమస్యే దాదాపు రెండేళ్లు కంటిన్యు అయిన కారణంగా ఇక ప్రజాదర్బార్ గురించి ఆలోచించలేదు. అయితే కోవిడ్ సమస్య ఇంకా కొంతున్నా ప్రజల జనజీవనం గాడిలోపడుతోంది. దానికితోడు షెడ్యూల్ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకనే ప్రజాదర్బార్ ను మొదలు పెట్టేస్తున్నారు.

సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం గంటపాటు జనాలను కలుస్తారు. అలాగే అదేరోజు మధ్యాహ్నం ప్రజాప్రతినిధులను, నేతలను కలవాలని డిసైడ్ అయ్యారు. మొత్తంమీద ఎంఎల్ఏలు, నేతలను సీఎం కలవటంలేదనే ఆరోపణలకు ప్రజాదర్బార్ తో జగన్ చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లే ఉంది.