టీడీపీ అధినేత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చేఎన్నికల్లో పార్టీని విజయ తీరం దిశగా అడుగులు వేయించడంలో ఆయన ముందున్నారు. నాయకులను కలుపుకొని పోతూ.. జిల్లా ల్లో పర్యటిస్తూ.. ప్రజల్లో చైతన్యం నింపుతూ.. చంద్రబాబు పార్టీ ని దూకుడుగా ముందుకుతీసుకు వెళ్తున్నా రు. గతానికి భిన్నంగా ఈ ఏడాది ప్రతి జిల్లాలోనూ మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలను ఆయన సమీకరిస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వ విధానాలపైనా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే పార్టీలో నైరాశ్యాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ అనుసరించిన మార్గాన్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారు. గతంలో 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్.. అభ్యర్థులను ఆరు మాసాల ముందుగానే ప్రకటించారు. దీంతో పార్టీలో నాయకులు ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తూ.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను.. చంద్రబాబు అనుసరిస్తున్నారు. పలు జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన ఆయా జిల్లాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నాయకులను కన్ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా రాయలసీమలో పర్యటించిన ఆయన ఆయన కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప నుంచి శ్రీనివాసరెడ్డి, రాజంపేట నుంచి గంటా నరహరి, డోన్ నుంచి సుబ్బారెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిలు పోటీ చేస్తారని ప్రకటించారు.
దీంతో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. గతానికి భిన్నంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై ఆ పార్టీలో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికలకు వారికి కావాల్సినంత సమయం దక్కుతుందని, పార్టీ తరుపున గట్టిగా పోరాడగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదేసమయంలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే.. వారిని స్థానిక నేతలు బుజ్జగించుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాలు సానుకూల దృక్ఫదాన్ని నింపుతాయని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates