జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ప్రజాస్వామ్యానికే హానికరంగా తయారవబోతోందా ? చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఓడిపోవాలని, బంపర్ మెజారిటితో తామే అధికారంలోకి రావాలని ప్రతి పార్టీకి ఉంటుంది. అందుకు తగ్గట్లే ప్రత్యర్ధిపార్టీ అభ్యర్ధులు ఓడిపోవాలని కూడా వ్యూహాలు పన్నుతారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్దంగా జరిగే తంతే అనటంలో సందేహంలేదు. కానీ ఎదుటి పార్టీలకు ఒక్కసీటు కూడా రాకుండా మొత్తం అన్నీ సీట్లు తామే గెలవాలని అనుకోవటం మాత్రం తప్పు.
ఇపుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి. కొద్దిరోజులుగా 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలని జగన్ తరచు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ అనుకున్నట్లు జరుగుతుందా లేదా అన్నది ఇపుడే ఎవరు చెప్పలేరు. కాకపోతే జగన్ అనుకున్నట్లు జరిగి 175 సీట్లూ వైసీపీనే గనుక గెలిస్తే ప్రజాస్వామ్యానికి చాలా హానికరమనే చెప్పాలి. ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం నాలుగుకాలాల పాటు ఉంటుంది.
ప్రజాస్వామ్యం లేని చోట నియంతృత్వమే మొదలవుతుంది. అలాంటి నియంతృత్వం మన సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం ఉండాలంటే ఏపార్టీ కూడా నూరుశాతం సీట్లు గెలవకూడదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని బహిరంగంగానే చాలాసార్లన్నారు. ప్రతిపక్షాలకు అసలు రాష్ట్రంలో పనేముందని చెప్పి తన ఆలోచనలకు మలేషియా, సింగపూర్ ప్రభుత్వాలను ఉదాహరణగా చూపేవారు. ఈ ఉద్దేశ్యంతోనే వైసీపీని అసెంబ్లీలో లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలే చేసి చివరకు సాధ్యం కాక వదిలేశారు.
చంద్రబాబు పోకడలను గమనించిన జనాలు 2019 ఎన్నికల్లో ఎలాంటి తీర్పిచ్చారో కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి జగన్ కూడా చరిత్రను గుర్తుపెట్టుకుని తన ఆలోచనలను మార్చుకోవాలి. కుప్పంలో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ అయితే అందుకు తగ్గట్లుగా వ్యూహాలను అమలు చేయటంలో తప్పులేదు. అంతేకానీ టీడీపీకి అసలు ఒక్కసీటు కూడా రాకూడదని కోరుకోవటం మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates