గంటా నరహరి గురించే పార్టీలో ఇపుడు చర్చించుకుంటున్నారు. పార్టీలోకి ఇలా వచ్చారో లేదో చంద్రబాబునాయుడు అలా టికెట్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ నుండి పోటీ చేయబోతున్నట్లు నరహరి పేరును చంద్రబాబు ప్రకటించారు. గంటా తెలుగుదేశం పార్టీలో చేరింది వారంరోజుల క్రితమే. పారిశ్రామికవేత్తగా పేరున్న గంటా ఆర్ధికంగా మంచి స్ధితిలోనే ఉన్నారు. మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ సోదరికి గంటా అల్లుడవుతారు.
బలిజ సామాజికవర్గానికి చెందిన గంటాకు ఆర్ధికంగానే కాకుండా సామాజికవర్గంలో కూడా కాస్త పట్టుందని సమాచారం. రాజంపేటకే చెందిన గంటా కుటుంబం చాలాకాలంగా వ్యాపారాల్లోనే బిజీగా ఉండేది. ఇపుడే రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని అనుకున్నారు. దాంతో వెంటనే టీడీపీలో చేరాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరటం కలికిరిలో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో నరహరికి టికెట్ ప్రకటించేయటం చకచకా జరిగిపోయింది.
లోక్ సభకు టికెట్ ప్రకటించేశారు కాబట్టి తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఇపుడు గంటాపైనే పడింది. నియోజకవర్గ ఇన్చార్జిలను బలోపేతం చేయటంతో పాటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే పార్లమెంటు స్ధానానికి పోటీ చేయటమంటే చిన్న విషయం కాదు. కాకపోతే గంటా కుటుంబానికి రాజకీయ వాసనలున్నాయి కాబట్టి చొచ్చుకుపోవటం కష్టం కాకపోవచ్చు.
ఇదే సమయంలో కడప లోక్ సభ అభ్యర్ధిగా శ్రీనివాసులరెడ్డిని ప్రకటించారు. శ్రీనివాస్ చాలా సంవత్సరాలుగా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబుకు బాగా దగ్గరైన నేతల్లో శ్రీనివాసరెడ్డి కూడా ఒకళ్ళని చెప్పాలి. మొత్తానికి ఉమ్మడి కడప జిల్లాలోని రెండు లోక్ సభ సీట్లలో పోటీచేసే అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇప్పటికే ఈ జిల్లాలో పులివెందులకు బీటెక్ రవిని ఇన్చార్జిగా ప్రకటించారంటే దాదాపు అభ్యర్ధనే అనుకోవాలి.