టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్.. చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేకాట శిబిరానికి వెళ్లక పోయినప్పటికీ.. తన పేరు ఉందనే ప్రచారం చేయడం.. పోలీసు రైడ్ తర్వాత పారిపోయినట్లు వచ్చిన పుకార్లపై ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్లు.. ఎవరికీ అర్ధం కాలేదని అంటున్నారు. ఎందుకంటే.. ఆయన తన కామెంట్లలో ఎవరిని ఆక్షేపించారు. ఎవరిని తిట్టిపోశారు..? అనేదానిపై చర్చ సాగుతోంది.
అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పటానుచెరు మండలం చినకంజర్ల శివారు లో ఉన్న మామిడితోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకిదిగి దాడి చేశారు. అయితే.. అప్పటికే.. చింతమనేనితో పాటు మరికొందరు పరారయ్యారని డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. అక్కడ 70 మంది ఉన్నారని, వీరిలో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
పట్టుకున్న వారి నుంచి రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అయితే.. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా పాల్గొన్నారని, పోలీసుల దాడి నేపథ్యంలో ఆయన పారిపోయారని తెలిపారు. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక, ఈ సమాచారంతో మీడియా రంగంలోకి దిగి.. దీనిపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేసింది.
ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ అనుకూల మీడియా సాక్షి మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది. చింతమనేనికి వ్యతిరేకంగా.. వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఫేస్ బుక్ వేదికగా చింతమనేని ఫైర్ అయ్యారు. “కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా…?” అని చింతమనేని ఫేస్ బుక్ లో ప్రశ్నించారు.
రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి. అని కోరారు. ఈ నీచమైన ప్రచారంతో.. కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు, తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైందని అన్నారు. మీ అసత్యాల సాక్షి ని ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు.
మీ రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలో నే. మీ చింతమనేని ప్రభాకర్ అంటూ తన ఫేస్ బుక్ పోస్టులో రాసుకొచ్చారు. అయితే.. చింతమనేని ఆగ్రహం ఎవరిపైన? అనేది సందేహంగా మారింది. ఎందుకంటే.. ఘటన జరిగింది..తెలంగాణలో.. కాబట్టి.. అక్కడి ప్రభుత్వంపై ఆయన కామెంట్లు చేశారా? లేక.. దీనిని ప్రచారం చేసింది.. సాక్షి కాబట్టి.. ఈ పత్రికను.. ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారా? అనేది సందేహంలో పడింది. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.